దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తెలుగు చాలా మధురమైన భాష. ఎంతో మంది కవులు, రచయితలు ఈభాషలో రచనలు చేసి దీనిని పరిపుష్టం చేశారు. అటువంటివారిలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ముఖ్యులు. తెలుగులో అందునా వ్యవహారికంలో సుబ్రహ్మణ్యశాస్త్రి గారిది అందె వేసిన చేయి.
శ్రీపాదవారి మీద ఇద్దరి ప్రభావం అత్యధికంగా ఉంది అనిపిస్తుంది. వారిలో ఒకరు వీరేశలింగం పంతులుగారు అయితే...రెండవ వారు గురజాడ. వీరేశలింగం గారి వల్ల ఆధునిక భావాలు అందిపుచ్చుకుంటే...గురజాడ నుంచి భాషను తీసుకున్నారు. అత్యంత ఆధునికమైన భావజాలాన్ని మరింత ఆధునికమైన , అద్భుతమైన వాడుక భాషలో కథలుగా రచించి తెలుగుజాతికి అందించిన వారు శ్రీపాద. అన్యభాషా సాహిత్యాల ప్రభావం ఏ మాత్రం లేకుండా స్వీయ ప్రతిభతో తెలుగువారికి నవ్య దృక్పథాన్ని అందించినది కేవలం వీరొక్కరే అని చెప్పవచ్చును.
శ్రీపాదవారి కథలలో భావాలు ఎంత బలంగా ఉంటాయో వారి భాష కూడా అంతే బలంగా ఉంటుంది. శ్రీపాద వారు వాడినది సరళమైన వాడుక భాష.అందులోనే అత్యంత అద్భుతంగా రచించి అందరి చేత శభాష్ అనిపించారు శ్రీపాద. వీరి కథలు చదివిన ప్రతీ తెలుగువాడికి అందులోని తీయదనం అనుభూతం అవుతంది. అనుభూతం అయి ఆనంద తరంగాలలో ఓలలాడిస్తుంది.
శ్రీపాదవారికి తెలుగు, సంస్కృతం తప్ప మరే ఇతర భాషలు రావు.ఆయన నేర్చుకోలేదు కూడా. ఒకసారి ఓ యువకుడు ఆయన దగ్గరకు పోయి మీ భాష ఎందుకు ఇంత రమ్యంగా ఉంటుంది అనడిగితే...''నాకు హిందీ, ఇంగ్లీషు రాకపోవడమే''...అని సమాధానం చెప్పారట శ్రీపాదవారు. శ్రీపాదవారికి తెలుగు భాష అన్నా...తెలుగు సంస్కృతి అన్నా విపరీతమైన అభిమానం.అందుకే ఆయన తన అనుభవాలు-జ్ఞాపకాలూనూలో ఇలా చెప్పుకున్నారు.''నా దృష్టిలో తెనుగు దేశమే దేశం..తెనుగు భాషే భాష...తెలుగు మనుషులే మనుషులు...తెలుగు వేషమే వేషం. ఇంతేకాదు, ఏజాతి మొదటా-ఏ సందర్భంలోనూ-ఎందుకున్నూ నా తెలుగుజాతి తీసిపోదు.తెలుగు భాష సరస్వతీ వాగ్విలాసం, స్వయంభువు, అసూయజనకమైన మాధుర్యం దానిది. ఖండానికంతకూ ఏకైక మధురిమం అది''.అందుకే దీనిని కాపాడుకోవడమే అసలైన జాతీయత అని వీరి అభిప్రాయం. భారతీయుల్లో తెలుగు వారికే భాషాపరంగాను, ప్రాంతీయపరంగాను అభిమానం తక్కువనీ..దానిని వృద్ధి పరుచుకుంటేనే తెలుగు జాతికి వికాసమనీ, తన రచనల ద్వారానూ...అనుభవాలు-జ్ఞాపకాల ద్వారానూ చెబుతూవచ్చారు.తెలుగు మాండలికాలలోని ప్రయోగ వైవిధ్యంలో ఉన్న గొప్పతనాన్ని పసిగట్టి, అదే భాషకు జీవం వంటిదని, అభిమానంతో ప్రకటించారు. ఈ కింది వాక్యాలే దీనికి నిదర్శనం. ''ఒక్కొక్క సీమలో జీవకణం ఉంది. తెనుగు రక్తంలో...అన్నీ ఒక్క చోటికి చేర్చగల...అన్నీ ఒక్క తెనుగు వారి రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకురావాలి.''
శ్రీపాదవారు పుట్టింది, పెరిగింది ఒక సాంప్రదాయ బద్ధమైన కుటుంబంలో . ఆ కుటుంబంలోని వారికి సంస్కృత భాషే అభిమాన భాష. తెలుగు చదువుకోవడం ఒక నీచంగా భావించే సంప్రదాయం వారిది. అటువంటి కుటుంబంలో పుట్టి తెలుగుపై మమకారం పెంచుకోవడం, చివరకు కులవృత్తులను కూడా విడిచి పెట్టి తెలుగులోనే....అదీ వ్యవహారికంలో రచనలు చేయడం వీరి విశిష్టత.
మొదట శ్రీపాదవారు పద్యకవిగా సాహితీరంగంలో ప్రవేశించి అవధానాలు చేసినప్పటికీ ఆ తరువాత గద్యంపై కూడా బలమైన పట్టు సాధించి మహా రచయిత అనిపించుకున్నారు. తెలుగు వ్యవహారిక భాష పలుకుబడిలోని సొగసు, మాధుర్యం, శక్తీ తెలియాలంటే తప్పకుండా వీరి రచనలు చదివి తీరవలసిందే..అందుకే మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు వీరి గురించి ఇలా అన్నారు. ''జాను తెనుగు నేర్చినవారికే శాస్త్రిగారి రచనలు చదివి ఆనందించే అదృష్టం ఉంటుంది అని''. మరొక భాషలో అనువాదానికి లొంగని శైలి ఆయనది.వీరి రచనలు చదివితే వెనుకటి తరం గోదావరి జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలు, వారి వెనుకబడిన భావాలు, స్పర్ధలు, ఆప్యాయతలు ఇవన్నీ రమణీయంగా కలబోసి దర్శనమిస్తాయి. విస్తృత నేపథ్యంలోంచి అవలోకించగలిగితే అందరికీ....అన్ని కాలాలకీ వర్తించే చేదు నిజాలు, గుర్తుంచుకోదగ్గ సందేశాలు ఆయన రచనల్లో మనల్ని పలకరిస్తాయి. ఈనాటికీ అవి పాతబడిన రచనలుగా కనిపించవు.
19వ శతాబ్దం తరానికి చెందిన కథకుల్లో మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీపాదవారూ ఒక విలక్షణమైన కథన రీతిని మలుచుకున్నారు. వీరిలో ఒకరు కృష్ణాతీరం, మరొకరు గోదావరి తీరానికి చెందిన వారు కావడం ఆసక్తికరం. ఇద్దరి రచనల్లో స్వచ్ఛమైన తెలుగు పరిమళిస్తూ ఉంటుంది.
తెలుగుదనం సంస్కృతికి సంబంధించినది. భాషకు సంబంధించినంత వరకు రాసేది తెలుగే అయినా మాండలికమైన భేదాలు ఉంటాయి. మాండలికంలో రచించడం అప్పుడూ, ఇప్పడూ కూడా ఉన్నదే. తెలుగు నుడికారం అని మనం మామూలుగా అనుకుటున్నది నిజానికి మాండలికాలకు చెందినది. స్పష్టమైన స్థానీయత, మాండలికమైన నుడికారం స్థూలంగా తెలుగుదనంలోని భాగాలే.శ్రీపాదవారి కథల్లో విలక్షణత గాఢమైన స్థానీయత వారు వాడిన మాండలికం. ఇది చాలా శాతం రామకృష్ణ శాస్త్రి గారికి కూడా వర్తిస్తుంది. శ్రీపాదవారి కథలు బహుశా ఆయన రచించిన కాలంనాటి కంటే తరువాతనే బహుళ ప్రాచుర్యాన్ని, ప్రశంసనీ పొంది ఉంటాయి. ఈనాటికీ తెలుగుకథ అంటే ముందుగా వీరి పేరు చెప్పుకోవలసిందే.
శాస్త్రిగారు తన కథా వస్తువుల్ని, పాత్రల్ని..వారి పలుకుబడినీ జనంలోంచే తీసుకున్నారు. తమ చుట్టుపక్కల పరిసరాల్నీ....లోకం తీరు తెన్నుల్నీ సునిశితంగా పరిశీలించారు. హృదయాన్నీ, బుద్ధినీ సమన్వయం చేసి రచనల్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు.
శ్రీపాద కథా పరిసరాలు పరిమితమైనవే కావచ్చు.కానీ సంపూర్ణంగా ఆయనకు పరిచితమైనవి. ఆయన భాష తెలుగు దేశంలో ఒక ప్రాంతంలో ...ఒక వర్గంలో వాడుకలో ఉన్నదే కావచ్చు. కాని దాంట్లో ఎంత చైతన్యముందో తన కథల ద్వారా నిరూపించారు. తమకు బాగా నలిగిన భాషలో రాసినంత మాత్రాన ఇతర ప్రాంతాల, ఇతర వర్గాల పలుకుబళ్ళు ఆయనకు నచ్చలేదని అనుకోవడానికి వీలులేదు. ''ఐదు ప్రాంతాల పలుకుబళ్ళు తమ తెలుగు భాషకు ఐదు ప్రాణాలని'' ఒక సందర్భంలో ఆయనే స్వయంగా చెప్పారు.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచనా వ్యక్తిత్వం రూపుదిద్దుకున్న కుటుంబ వాతావరణమూ, ప్రాంతమూ, కాలమూ సంశ్లిష్టమైనవి. ఆయన కుటంబ వాతావరణం వైదిక పండిత సాంప్రదాయానికీ, విశ్వాసాలకూ సంబంధించినది. పుట్టి పెరిగిన ప్రాంతం చాలా వరకు కుల విద్యలకూ, కావ్య పాఠాలకూ, సంస్కృత సంస్కృతికీ నిలయమైన గోదావరీ పరివాహక ప్రాంతం. అక్కడి తెలుగు భాషపై సంస్కృత ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. క్రియా రూపాల్లో 'ఏ' అనే ఒక నూతన ధ్వని కనిపిస్తుంది. ఇచ్చేడు, కొట్టేడు ఇలా.... అలాగే 'ట' కారానికి బదులు షకారం వినిపిస్తుంది. శ్రీపాద వారి కథలలో ఇవి కొట్టచ్చినట్టు కనిపిస్తాయి. ఆయన రాసిన అరికాళ్ళకింద మంటలు కథలో సంభాషణ ఈ కింద విధంగా ఉంటుంది. ''నేనింకా వండి వడ్డించగలననే అనుకున్నావుషోయ్''........''మీ అమ్మాయి యేం చేస్తోంది.......అది వూరికే కూచుంఛోందనా నీ వూహ.........శాస్త్రం చెప్పిన తరువాయిగా వుంది నీ మాట. కాటికి కాళ్ళు చాచుక్కూచున్న దానికి నాకు వైద్యాలేమిషోయ్ యిప్పుడూ''....... ఇలా.
శ్రీపాద తెలుగు భాషను ఎంత అందంగా వాడుకున్నారో సంస్కృత భాషను కూడా అంతే అందంగా సందర్భానికి తగ్గట్టుగా వాడారు. వడ్లగింజలు మొదలగు కథలను పరిశీలిస్తే మనకి ఇది అవగతమౌతుంది. ధౌర్త్యం, ప్రాజ్ఞత, మర్మాఘాతం, శైశవమౌగ్ధ్యం, భృత్యుడు, వర్చస్సు ఇలా అనేక పదాలను ఈయన కథలలో వాడుకోవడం జరిగింది.
శ్రీపాదవారి కథల్లో పండిత సంప్రదాయం ఉండవచ్చు. దృక్పథంలో పరిమితులండవచ్చు, వైరుధ్యాలుండవచ్చు. విశ్లేషించుకుంటే స్ఫూర్తి పొదంగలిగే భాషా సంస్కారమూ, సాహిత్య సంస్కారమూ వాటిల్లో చాలా ఉంది. భిన్న భాషా శైలుల సామర్ధ్యమూ, పలుకుబళ్ళలోని పదునూ, సారళ్యమూ వీరి భాషా సంస్కారంలోని అంశాలు. చిత్తశుద్ధీ కథనకౌశలమూ, సునిశితమైన లోకపరిశీలనము, తెలుగుజాతీయతా ఆయన సాహిత్యంలోని అంశాలు. అందుకే ఈయన గురజాడ తరువాత జాతి కథకుడు.



2 కామెంట్‌లు:
అద్భుతం. బాగా రాశారు.
thnak u. inka chala rayalani vunna rayaleka poyanu. inko sari malli rayali. sorry na personal work vundi mee vyakhya ki ventane reply ivvalekapoyanu
కామెంట్‌ను పోస్ట్ చేయండి