3, మార్చి 2010, బుధవారం

జాషువా-సుమధురకవి

                 జాషువా... ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఒక బాధాతప్త హృదయం. వేదన నిండిన దళిత కవిత్వం. అయితే జాషువాలో ఒక అద్భుత కవి కూడా దాగున్నాడు. ఆయనొక సుమధుర కవి. కవిత్వాన్ని అనుభవించి.. తాదాత్మ్యం చెంది రచించిన వారిలో జాషువా ఒకరు. ఆయన కవిత్వం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఆ మహ‍నీయుడి శైలి సంప్రదాయబద్ధమైన పద్యరూపంలో ఉన్నప్పటికీ అందులోని అంశాలు పాఠకుని మనసును, బుద్ధిని కూడా ఆలోచింపజేస్తాయి.
               జాషువా ఎన్నో అవమానాలకు , తిరస్కారాలకు గురి అయ్యాడు. అయినప్పటికీ కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో తన రచనలను సాగించి అత్యున్నత శిఖారాలు అధిరోహించగలిగాడు. ఆ ధీశాలికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ. దీనికి నిదర్శనమే ఈ పద్యం.
                      ''గవ్వకు సాటిరాని పలుగాకులు మూకలసూయ చేతన
                      న్నెవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే
                      యివ్వసుధాస్థలింగొడమరె రసయుద్ధుల్ ఘంటమోనెదన్
                      రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెదనాంథ్ర వాణికిన్''
అన్న ఆయన మాటలు, చెప్పినట్లుగానే చేసి నిరూపించుకున్నాడు.
              జాషువా మొదట... భావకవి. ఆయన భావాలు ఎంతో సున్నితంగా, సూటిగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అందుకు నిదర్శనం ఆయన రచించిన శిశువు ఖండిక. భావతీవ్రత, వాస్తవికత జాషువా కవిత్వం ప్రధాన లక్షణాలు. జాషువా కవిత్వంలో కఠిన పదాలకు, దీర్ఘ సమాసాలకు తావు లేదు. హృదయాలను పలుకరించే భావాలు, తనువులను పులకరించు శైలీ విన్యాసాలు ఆయన కవిత్వంలో ప్రత్యేకత. జాషువా కవిత్వం మృదువైనది....మనుషుల హృదయాన్ని తట్టిలేపి నిద్రమత్తును వదిలించేది. శిశువు ఖండికలో అప్పుడే పుట్టిన ఒక శిశువు గురించి ఆయన చేసిన వర్ణన ఎంతో ఆత్మీయంగా, రంజింపచేసేదిగా ఉంటుంది. పై వర్ణనలకు శిశువు ఖండిక అత్యద్భుతమైన ఉదాహరణ.
             ఉయ్యాలలో పడుకున్న చిన్న పిల్లలను గమనిస్తే మనకు చాలా వింతగా ఉంటుంది. ఏమిటేమిటో అంటారు..ఎందుకో నవ్వుతారు. వారిలో వారే మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తారు. వీళ్ళేదో ఆలోచిస్తున్నారు అన్నభావనను కలిగిస్తారు. కానీ మనం ఇవన్నీ చాలా సహజంగా తీసుకుంటాం...పెద్దగా పట్టించుకోం. అయితే జాషువా మాత్రం వీటినే ప్రాతిపదికగా తీసుకుని అద్భుతమైన ఖండికను రాశారు. అందులోని పాదాలు ఇలా ఉంటాయి.
                                       '' బొటనవ్రేల ముల్లోకములు చూచి లోలోన
                                                  నానందపడు నోరులేని యోగి
                                                  ఉఊలు నేర్చిన యొక వింత చదువరి
                                                  ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి
                                                   తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి.''
   నిజమేకదా చిన్నపిల్లలు యోగులతో సమానమే కదా....జాషువా ఇక్కడ ప్రసవాన్ని సముద్రంతో పోల్చారు. సాగరాన్ని ఈదడం ఎంత కష్టమో...ప్రసవం అయి బిడ్డ బయటకు రావడం కూడా అంతే కష్టం...ఆలోచిస్తే ఇంతకంటే సరైన పోలిక ఉండదేమో. ఇంకా...
                                                              ''ఊయేల తొట్టి యే ఉపదేశమిచ్చనో
                                                                కొసరి యొంటరిగనూకొట్టును
                                                                అంబతో తనకెంత సంబంధమున్నదో
                                                                 యేడ్చి యూడిగము జేయించుకొనును
                                                                పరమేశ్వరుండేమి సరసంబులాడునో!
                                                                  బిట్టుగా గేకిసల్గొట్టుకొనును
                                                                మూన్నాళ్ళలోన నెప్పుడు నేర్చుకొనియెనో
                                                                పొమ్మనిచో చిన్నబుచ్చుకొనును.''
మనకెప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుందా!...ఒక చంటిబిడ్డ గురించి ఇంతగా వర్ణించడం ఎవరికిసాధ్యం. ఇంత గొప్పగా....అందంగా ఆలోచించడం ఒక్క జాషువాకే చెల్లింది.
                  జాషువా భావకవే కాదు... అభ్యుదయ కవి కూడా. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. జీవితాంతం పోరాటం చేశారు. బాధా మయమైన జీవితం గడిపిన జాషువా గుండెలోతుల్లోంచి పద్యం పెల్లుబికింది....భావం పొంగిపొర్లింది. అందులో నుంచి వచ్చినవే ఫిరదౌసి, గబ్బిలం మొదలగు కావ్యాలు. జాషువా కవిత్వంలో మానవతావాదం పుణికిపుచ్చుకుంది. సంఘంలో దారిద్ర్యం, అస్పృశ్యత ఆయన హృదయాన్ని కుమ్మినట్టు చేశాయి. అందుకే జాషువా హృదయ స్పందనే...ప్రజా నాడి అయింది.
                  జాషువా విశ్వ మానవ సమానత్వం ఆశించారు. అందరూ ఒకే బాటలో నడవాలని ఆశపడ్డారు. కుల, వర్గ, భేదరహిత సమాజం కోసం తన కవిత్వంతో అహర్నిశలూ కృషి చేశారు. అందుకే ఆయన....
                                        ''కులమతాలు గీచుకొన్న గీతలజొచ్చి
                                        పంజరాన గట్టుపడను నేను
                                        నిఖిలలోకమొట్లు నిర్ణయించిన, నాకు
                                       తరుగులేదు,విశ్వనరుడనేను''............అని చాటుకున్నారు. 
               ''మన... మనో మందిరాలలో కులరహితమైన ధార్మికజ్యోతి ప్రకాశించాలి.... సంకుచిత భావదీప్తి కాదు. సాటి మనుష్యులను సహోదర భావంతో చూడాలి తప్ప కులభావంతో కాదు. మనిషికీ, మానవత్వానికీ నడుమగల సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే కులరక్కసి రూపుమాసిపోవాలి. ''జాషువా కాంక్షించిన ,ఉద్భోదించిన మానవతావాదమిది.  ఆ నవ సమాజం ఆవిర్భవిస్తుందని భావిద్దాం. దాని కోసమై పాటు పడదాం.

5 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

బాగా రాసావు.
సమకాలీన సాహిత్యంలో వచనరచన జోరుగా సాగుతున్నా భావకవిత్వం తో అందరిని మెప్పించగలిగిన గొప్ప కవి జాషువా. గబ్బిలం ఒక్కటి చాలు జాషువా కవితాపటిమని చూపించడానికి.

హరిశ్చంద్ర పద్యాలు జాషువా రాసారని చాలామందికి తెలియదు.

"మాయమేయజగంబె నిత్యమని సంభావించి
మోహంబునా ఇల్లాలిని, కుమారుని ప్రాణంబులెందునందాక
ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇపుడెందున్ కట్టెలన్ కలునో...."

అని గొప్ప వేదాంత ధోరణిని కనబరిచారు.

అలాగే
ఇచ్చోటనే సత్కవీంద్రును కమ్మని కలము నిప్పులలోన కరగిపోయె
ఇచ్చోటయే లేత ఇల్లాలి నల్లపూసల సవ్వడి గంగలో కలసిపోయే
.....

లాటి పద్యాలలో అంతో ఆధ్యాత్మికత, వేదాంత ధోరణి కనిపిస్తాయి.

మనోజ్ఞ చెప్పారు...

అవును అక్కా...నువు చెప్పింది నిజమే...వాటిల్లో ఎంతో ఆధ్యాత్మికతే కాదు. ఎంతో సత్యం కూడా దాగుంది. నా తదుపరి పోస్ట్‌లో వాటి గురించి రాస్తాను

మనోజ్ఞ చెప్పారు...

ఉంటాయి, కాని మీకు రాయడం రావాలి. చదువుతో సంబంధం లేదు.

హను చెప్పారు...

chala mamchi padyalanu marala okasar gurtu techukunela chesaru,

మనోజ్ఞ చెప్పారు...

అవునండీ....జాషువా రాసినవి ఇంకా మంచి పద్యాలున్నాయి. వాటి గురించి నా తర్వాత పోస్ట్‌లో రాస్తాను.