3, ఆగస్టు 2010, మంగళవారం

కొకు రచనాశైలి...చదువు నవల

ఇతి వృత్తాలలోని వాస్తవికతా నిరూపణలో, జీవిత వాస్తవాన్ని వ్యాఖ్యానించే అభ్యుదయ ధృక్పథంలో ,శిల్పనైపుణ్యంలో ,ప్రయోగాలలో , ధోరణిలో, శైలిలలో కుటుంబరావు మార్గదర్శకులు. సంక్షిప్తత,సూటిదనం, సారళ్యం, పలుకుబడీ, పదునూ గల ఆధునికి వచన శైలిని సాధించిన కుటుంబరావు ఆదర్శప్రాయులు, అగ్రగ్రణ్యులు.

సామాజిక వాతావరణానికీ, వ్యక్తి జీవితానికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. జీవితాన్నీ, సమాజమూ....సమాజాన్ని జీవితమూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనిషి కానీ, పరిస్థితులు కానీ నిత్యం మార్పులకు గురవుతూంటాయి. ఈ పరస్పర సంబంధాలు కుటుంబరావు రచనల్లో మనకు ఎక్కువగా కనబడుతూంటాయి. మామూల మనుష్యుల మామూలు జీవితంలో ఒక సన్నివేశమో, ఒక సంఘటనో, ఒక కుసంస్కార అభిప్రాయమో, ఒక సంస్కార భావమో ఈయన రచనా వస్తువులుగా రూపాంతరం చెందాయి. కుటుంబరావు తన రచనల ద్వారా మంచి అనుభవజ్ఞానాన్నీ, ఘాటైన నిజాలనూ పుటం పెట్టి నిగ్గుదేల్చి అందించారు. ఈ జ్ఞానపరమావధి, ఈ నిజాల లక్ష్యం....సమాజంలో మార్పు, ఆలోచనల్లో మార్పు, ప్రవర్తనలో మార్పు.
కుటుంబరావు కథలు, నవలల్లో ఉధృతంగా సాగే భావోద్రేక ప్రధానమైన సంఘర్షణలు కానీ, ఆకర్షణీయమైన ఇతర ధోరణులు కానీ కనిపించవు. అందుకే వీరి రచనలు చాలా మందిని ఆకర్షించలేదు అని కొందరు విమర్శకులు అంటారు. వీరి రచనల్లో ఆకర్షణలు ఉండవు...కేవలం ఆలోచలు మాత్రమే ఉంటాయి. చదువుతున్నంతసేపూ, తరువాత కూడా పాఠకులను ఆలోచింజేస్తాయి. కొకు కాల్పనిక సాహిత్యశైలి గంభీరంగా సాగే నదీ ప్రవాహం. ఒడిదుడుకుల్లేకుండా సాగే ఈ నదీ ప్రవాహంలో పాఠకుడు ప్రశాంతంగా గమ్యం చేరతాడు. కానీ ప్రయాణం గురించి ఆలోచిస్తాడు.

కొడవటిగంటిది ఒక ప్రత్యేక తరహా శైలి. వీరి రచనల్లో పాజిటివ్ నెస్ కంటే నెగటివ్ నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక విషయం గురించి ఏం చేయాలో...ఎలా చేయాలో చెప్పడం ఒక పద్ధతి. సాధారణంగా ఇది అందరూ చేసేది. ఏం చెయ్యకూడదో చెప్పి అవతలివాడిని ఆలోచింపజేసే ప్రయత్నం చేయ్యడం మరొకపద్ధతి. ఈయనది ఈ పద్ధతే. ''ఉపదేశం మన వ్యక్తిత్వాన్ని పరాభవిస్తుంది....ఆలోచన రేపే గుణం వ్యక్తిత్వాన్ని నిద్రలేపుతుంది'' అని అంటారు కుటుంబరావు. ఈ ధోరణినే కొకు తన రచనల్లో ప్రతిబింబించారు.
ఇక చదువు నవల విషయానికి వస్తే.....ఇది ముఖ్యంగా చదువు ప్రాముఖ్యాన్ని తెలియచేసేదిగా ఉంటుంది. విద్య అంటే జ్ఞానం సంపాదించడం. మళ్ళీ ఇది రెండు రకాలు. ఒకటి పుస్త జ్ఞానమూ, రెండవది అనుభవ జ్ఞానమూ. ఈ రెండూ చదువు ద్వారానే లభిస్తాయి. ''విద్య వల్ల లభించే జ్ఞానం జీవితం సార్ధకం చేసుకోవడానికి ఉపయోగపడాలి. అపుడే ఆ విద్యకూ, జ్ఞానానికీ సార్థకత చేకూరుతుందని'' కుటుంబరావు గారి ధృడమైన అభిప్రాయం. దీనినే ఆయన తన చదువు నవల్లో చెప్పారు. చదువు, మనిషి ఈ రెండింటికీ ఉన్న సంబంధం.....చదువు వల్ల మానవుడు పొందే పరిణితి.....మనిషికి చదువు యొక్క ఆవశ్యకత....చదువుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాలు...సమాజం­-పరిణామాలూ ఇవన్నీ చదువు నవల్లో మనకు కనిపిస్తాయి.

చదువు నవల్లో 1915..1935 చారిత్రక కాలంలోని రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా గుంటూరు జిల్లాకు చెందిన రెండు కుటుంబాలు..... వాటిలో రెండు తరాల చరిత్రా కనిపిస్తుంది. ఈ నవలలో సీతమ్మ, శ్రీమన్నారాయణ, సుబ్బమ్మ, ఆదినారాయణ, శేషగిరి, పార్వతీశం, శ్యామలా కుటంబాలు ప్రధానంగా కనిపించే కుటుంబాలు. వీటిలో ఒక్క శ్యామల కుటుంబం మాత్రమే మద్రాసు నగర జీవితంలో బాగా బతుకుతున్నామనే భ్రమలో కొట్టుకుపోయే కుటుంబం. మిగతావన్నీ గ్రామీణ వ్యవసాయ సమాజంలో పేరున్న మధ్య తరగతి కుటుంబాలు. నవలలోని ప్రధాన భావ సంఘర్షణ అంతా ఈ కుటంబాల జీవితమూ...వీటి చుట్టూ సమాజంలో తిరిగే పాత్రల మధ్య జరుగుతుంది.

చదువు నవల్లో కుటుంబరావు దృష్టి కేంద్రీకరించింది సీతమ్మ కుటుంబం మీద. ఇందులోని కీలక పాత్ర పేరు సుందరం. ఇతడు సీతమ్మ కొడుకు. నవల అంతా సుందరం యొక్క ఆత్మ చరిత్ర. అతని ఆత్మ యొక్క క్రమక్రమావిష్కారం. సుందరం చదువు...దాని వల్ల అతను పొందిన వికాసమూ.....అలాగే పతనావస్థ నవలా వస్తువు. ఇందులో సుందరం క్రియ యావత్తూ చదువు అనే మూడక్షరాల్లోనే ఒదిగి కూర్చుంటుంది. సుందరానికి చదువు అంటే అమిత గౌరవం. నవల మొదట నుంచీ చివర వరకూ చదువుకోవడమే తన లక్ష్యం అన్నట్టు ఉంటాడు.

సుందరం చదువు మొదలుపెట్టడం దగ్గర మొదలైన నవల అతడి కొడుకు చదువు మొదలెట్టడంతో ముగుస్తుంది. ఈ మధ్యలో సుందరం చదువు సాగిన విధానం, ఆనాటి సాంఘిక పరిస్థితులు, సుందరం చదువు కోసం పెళ్ళి చేసుకోవడం, ఉన్నత విధ్యాభ్యాసానికి వెళ్ళిన సుందరం చదువును విడిచి పెట్టడం, తరువాత డబ్బులు లేక పూర్తిగా చదువుకోవడం మానేయడం, తరువాత సుందరం జీవిత విధానం అంతా నవల్లో చెప్పబడింది. నవల మొదట్లో సుందరానికి చదువు మీద సదభిప్రాయమే ఉంటుంది. అందరూ ఉద్యోగాల కోసం చదువుకుంటుంటే...అతను మాత్రం జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే చదువుకుంటాడు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ చదువును కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ తరువాత పరిస్థితులల్లో మార్పు వస్తుంది. ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయానికి వెళ్ళిన అతడు అక్కడి వాతావరణానికి ప్రభావితం అవుతాడు. అది వరకల్లా చదువు మీద ఉంటూ వచ్చిన అభిమానం అప్పుడు జీవితం మీదకు మళ్ళుతుంది. దానికి కారణం సుందరం కూడా వూహించలేకపోతాడు. సాహిత్యంలో చాలా పుస్తకాలు చదువుతాడు. ఈ పుస్తకాలతో సుందరానికి కొత్త వికాసం వస్తుంది. కానీ ఆ వికాసం అతడి జీవితానికి ఏ మాత్రం సన్నిహితం కాలేకపోతుంది. అది జీవితానికి ఎంత వరకు ఉపకరిస్తుందో కూడా తెలుసుకోలేకపోతాడు. ఇక్కడ సుందరం యూనివర్శిటీ చదువు గాంధీ అరెస్ట్ తో ఆగిపోతుంది. మరలా విశ్వవిద్యాలయం తెరిచినా గానీ డబ్బు కొరత వల్ల అతని చదువు విద్యావిధానం సాగదు. సుందరం ఆస్తి యావత్తు అప్పుల వాళ్ళ పాలు అవుతుంది. తన చదువు ఆగిపోయిందని తెలియగానే సుందరం బాగా కృంగిపోతాడు. అప్పటి వరకు చదువుకున్న దాన్ని కూడా మర్చిపోతాడు. అదే అడుగు...అట్టడుగు...ఇంతకన్నా కృంగిపోవడానికి వీల్లేదు అనే ఉద్దేశ్యంతో బతుకుతూ నిస్తేజమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఇక్కడతో సుందరం కథ ముగుస్తుంది. తరువాత మూడోతరం ప్రతినిధైన సుందరం కొడుకు చదువుతో నవల ముగుస్తుంది. స్థూలంగా చదువు నవల.

కుటుంబరావు ఈ నవల ద్వారా ఏం చెప్పదలిచారు అని గమనిస్తే.... ఇది ఒక వ్యక్తి వైఫల్యం కథ. సుందరం ఆత్మ చరిత్ర. ఇతను పరిసరాలలోని ఘటనలకు బానిసలాంటివాడు. ఆ ఘటనా చక్రాన్ని ఏ విధంగా తిప్పలేనివాడు. దీనిని సాధు ప్రవృత్తి అనేకంటే దౌర్భల్యమనడమే సబబు. అతని మొత్తం క్రియ అంతా చదువుతోనే ఉంటుంది. అయితే అది కూడా అసమాపక క్రియగానే ముగుస్తుంది. ఆర్ధిక మాంధ్యం రోజుల్లో వాటిల్లిన ఆస్తి నష్టం సుందరం బెనారసు చదువు కొసముట్టనివ్వలేదు. అనుభవాలు స్వీకరించడమే గానీ.....అనుభవాలు కలిగించడం సుందరానికి చేత కాలేదు.

ఈ నవలలో సుందరం మొదట నుంచీ జీవిత ప్రవాహానికి దూరంగానే ఉండడానికి ప్రయత్నిస్తాడు . పిల్లల ఆటపాటల నుంచీ, సమవయస్కుల వినోద ప్రియత్వం నుంచీ, రాజకీయాల నుంచీ, వయోధికుల వ్యవహారాల నుంచీ విడివడి సాక్షి ప్రాయుడయ్యాడే గానీ...భాగస్వామిగా పాల్గొనలేదు. నిజానికి ఇతనికి జీవితం అంటే భయం. ఆత్మవిశ్వాసం పూజ్యం. అతని దృష్టికి ఏ పక్క తిరిగినా జీవిత సముద్రంలో ఈదలేకుండా పడి కొట్టుకుంటున్న వాళ్ళే కనిపించారు గానీ జీవిత శిఖరాన్నెక్కి నిర్మాణాలు చేసేవారు కాదు. సుందరం మొదట నుంచీ బాగా చదువుతున్న కనపడతాడే గానీ అతడు నిజంగా చదువుకోలేదు. నిజానికి ఆ చదువు అతని జీవితంలో ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అతడికి విద్య జీవితంతో ఏ విధంగా పెనవేసుకుని ఉంటుందో తెలియదు. తల్లి చదివించినంత వరకు చదువుకున్నాడు. అది ఆగిపోయినప్పటి నుంచి నిస్తేజుడై ఏ పనీ చెయ్యలేని వాడైపోయాడు. సుందరం పుస్తకాల ద్వారా... అనుభవాల ద్వారా సంపాదించుకున్న జ్ఞానం తన జీవితంలో అన్వయించుకోలేకపోయాడు. అలా చేయగలిగి ఉంటే అతను చదివిన చదువుకు సార్ధక్యం లభించి ఉండేది. అలాగనీ ఉద్యోగం చేసాడా అంటే అదీ చెయ్యలేకపోయాడు. రెండింటికీ మధ్యస్తుడై ఉండిపోయాడు. ''జ్ఞానంలో సుందరానికి చాలా విశ్వాసం. జీవితంలో రాదగిన మార్పులు రావడానికి అజ్ఞానం తప్ప ఇంకేం అడ్డు లేదని నమ్మేవాడని'' ఈ నవల్లో సుందరం గురించి చెబుతారు కుటుంబరావు. అయితే సుందరం ఈ సిద్ధాంతాన్ని కేవలం విశ్వసించాడు.... ఆచరించలేదు. ఆచరించి ఉంటే సుందరం తన చదువును కొనసాగించి ఉండేవాడు లేదా అప్పటి వరకు చదువుకున్న చదువును జీవిత గమనానికి ఉపయోగించేవాడు. ఇదీ చదువు నవల్లో కుటంబరావు ఆవిష్కరించి సత్యం. ఈ సత్యం ఇప్పటికీ చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. చదువుకుంటున్నారు కానీ దాని పరమార్ధం తెలుసుకోలేక జీవిత ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. భావాలు ఎలా అలవడుతాయో....ఆ భావాల్లోని వైరుధ్యాలు ఏమిటో.... అవి వ్యక్తిత్వ వికాసంలో ఏ పాత్ర వహిస్తాయో చదువు నవల ద్వారా నిరూపించారు కొడవటిగంటి కుటుంబరావు.

10 కామెంట్‌లు:

తార చెప్పారు...

ఎంతకీ సిద్దాంతాలు గురించి శిఖరాగ్ర సమావేశాల్లో చర్చించటం కాదు, మార్పు మన ఇంటిలో నుంచే రావాలి అని కొ.కు. చక్కగా తన కధల్లో చెప్పేవారు.

చాలా రోజులకి కనపడ్డారు, మంచి టపా...

Afsar చెప్పారు...

రీడర్ రెస్పాన్స్ సిద్ధాంత ప్రభావం అని కాదు కానీ, ఈ మధ్య కొంత కాలంగా నేను చాలా తీవ్రంగానే, చదువు, పఠనం అనే ప్రక్రియల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. పఠనం అంటే ఆబగా పది పుస్తకాలు తిప్పేయడం మాత్రమే అనుకునే ఎగువ మధ్య తరగతి లెదా నయా సంపన్న భావుకులు మళ్ళీ కొ.కు "చదువు" చదవాలనుకుంటా. చదువు అనేది ఒక వొంటరి/అలౌకిక వ్యవహారం కాదనీ, అది లోక వ్యవహారం అనీ అర్ధం అవుతుంది.

మంచి వ్యాసం, మనోజ్ఞ గారూ: మీ వచనం కూడా హాయిగా వుంది. 1915-35 ల సామాజిక చరిత్రని చెప్పే ఇంకా ఇతర రచనలు కూడా ఇలాగే పరిచయం/విశ్లేషణ చేస్తే బాగుంటుంది. ఆలోచించండి.


అఫ్సర్

మనోజ్ఞ చెప్పారు...

అవును తారగారూ....ప్వంతపని ఉండి మా వూరులో ఉండిపోవడం వల్ల బ్లాగులో ఏమీ రాయలేకపోయాను. మీరు చెప్పేది చాలా నిజం. మార్పు గురించి కొకు ఇంకా ఇలా అంటారు.''మార్పు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండా, దానికి అణుగుణమైన మనుష్య ప్రయత్నం చేయకుండా ఏదో ఒక మంచి జాగా చూసుకుని హమ్మయ్య అని చతికిలబడి...ఆ మీదట శాశ్వతమైన ఆనందం పొందుదామని మానవుడు చేసే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కావని.''

మనోజ్ఞ చెప్పారు...

ధన్యవాదాలు అఫ్సర్ గారూ.... తప్పకుండా మరిన్ని చారిత్రక రచనలను పరిచయం చేసేందుకు ప్రయత్నం చేస్తాను. అవునండీ చదువు నవల ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. విద్య అంటే ఏమిటో తెలియాలంటే ఇలాంటివి చదివి తీరవలసిందే. చదువు గురించి పక్కన పెడదాం కనీసం పఠనం అయినా సరిగ్గా చేస్తున్నారాంటారా ఈరోజుల్లో. ఆలోచిస్తే లేదనే అనిపిస్తుంది నాకు. శ్రద్ధగా పఠనం చేసినా కొంతలో కొంత ఉపయోగం ఉంటుందనే అనుకుంటున్నాను. మార్కులు,ర్యాంకుల గోలలో పడి అసలు జ్ఞానం సంపాదించడం సంపాదించడం మాటే మర్చపోతున్నాం మనం. కాదంటారా.....

Renuka Devi Gaddam చెప్పారు...

మీ వ్యాసం బావుంది కానీ... వాక్యాలు ఒకటికి రెండు సార్లు చదివి అర్ధం చేసుకోవాల్సి వచ్చింది. వాక్యాలు క్లిష్టంగా ఉన్నాయి.

మనోజ్ఞ చెప్పారు...

వాక్యాలు క్లిష్టంగా ఉన్నాయా...ఈ వ్యాసానికి ఆ మాత్రం రాయకపోతే పట్టు ఉండదని నా భావన.అందుకే అలా రాసాను. ఏది ఏమైనా నా తరువాత టపాలో మీ సూచనను గుర్తుంచుకుని రాస్తాను.

Renuka Devi Gaddam చెప్పారు...

ఈ సారి రంగనాయకమ్మ పుస్తకం గురించి వ్రాయండి. ఇది నా సూచన మాత్రమే.

వేణు చెప్పారు...

కొ.కు. శైలి గురించి చాలా చర్చ జరగాల్సివుంది. అది మెరుపులేమీ లేకుండా సూటిగా , అనాకర్షణీయంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. అయితే నా అనుభవం దీనికి వ్యతిరేకం. కుటుంబరావు గారి శైలి నన్ను సమ్మోహనపరిచింది. అందరికీ చక్కగా అర్థమయ్యే ‘నమూనా’ భాషా శైలిని ఆయన డెబ్బై ఏళ్ళ క్రితమే వాడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

మీ టపా బావుంది. అభినందనలు!

హరే కృష్ణ చెప్పారు...

మంచి టపా తో ముందుకొచ్చారు
అభినందనలు

మనోజ్ఞ చెప్పారు...

ధన్యవాదాలు వేణు గారూ, హరేకృష్ణ గారూ. కొకు రచనలు నన్ను కూడా చాలా ఆకర్షించాయి. చాలా కాలం క్రితమే నేను వారి అన్ని రచనలను చదివాను. అయితే వీరి రచనలు అర్థం కాలేదని అన్నవారిని కూడా నేను చూశాను. కొకు గురించి చర్చలు జరగాల్సి ఉన్న మాటను నేనూ అంగీకరిస్తాను. ఈమధ్యనే అనుకుంటాను మనవాళ్ళు కొకు శతజయింతుత్సవాలు చేశారు. కానీ అవి అంత బాగా జరిగినట్టు లేదు. జరిగాయని తెలుపు కానీ తరువాత వాటి గురించి ఎక్కడా వినబడలేదు.