తెలుగు పాట అనగానే గుర్తుకువచ్చే మొదట పేరు ఘంటసాల. మూడు తరాల పాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్నీ తన కమనీయ కంఠ మాధుర్యంలో ఓలలాడించిన గాయకుడు ఘంటసాల. గొంతులో అమృతం నింపుకుని పాటలు పాడుతున్నారా అనే అనుభూతికి లోను జేసే ఒకే ఒక గొంతు ఘంటసాల గొంతు. పాటలో లీనమయి.... పాటే ప్రాణమయి జీవించిన ఘంటసాల జయంతి ఈరోజు డిశంబర్ 4న.
కళలకు నిలయమైన విజయనగరం జిల్లాలో సంగీత విద్యనభ్యసించిన ఘంటసాల జీవితం తెరచిన పుస్తకం. నేపథ్య గాయకులలో ఘటంసాలను మించినవారు లేరు..... ఇక రారు అని ఘంటాపథంగా చెప్పవచ్చును. ఘంటసాల గురించి చెప్పడానికి తెలుగులో ఉన్న విశేషణాలు, పొగడ్తలు అన్నీ కలిపినా సరిపోవనిపిస్తుంది. తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతనాన్ని తన తీయటి కంఠంతో ప్రపంచానికి పరిచయం చేసిన ఘంటసాల ఇప్పటికే కాదు ఎప్పటికీ నేపధ్యగాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోతారు.
ఘంటసాల పాడిన ప్రతీ పాట ఒక ఆణిముత్యం. ఎంత మంది గాయకులతో కలిసి పాడుతున్నా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగల ఒకే ఒక గొంతు ఘంటసాలది. పాట చివరలో ఒకే ఒక్క పాదాన్ని పాడి కూడా మొత్తం పాట క్రెడిట్ కొట్టేయడం ఘంటసాల సొంతం. ఇందుకు నిదర్శనం 'ఇద్దరు మిత్రులు' సినిమాలో 'పాడవేల రాధికా' అన్న పాట. ఇందులో ఘంటసాల చివరలో చిన్న ముక్క పాడతారు. మొత్తం పాట అంతా సుశీలదే ఉంటుంది. కానీ ఆ ఒక్క ముక్కలో ఘంటసాల సుశీలపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారు. ఇది ఆయనకు జన్మత: వచ్చిన గాన మాధ్యుర్యం. అంతే కాదు ఘంటసాలకున్న మరో ప్రత్యేకత మరే ఇతర గాయకులకు లేని లక్షణం. ఘంటసాల ఏ నటుడుకి పాడుతున్నారో ఆ నటుడే స్వయంగా ఆ పాట పాడుతున్నాడా అన్న అనుభూతికి లోను చేయడం. ఏపాటకు ఎంత మోతాదులో భావం పలికించాలో ఆయనకు ఎవరూ వివరించనవసరం లేదు. తరవాతి తరం గాయకులలాగా కృత్రిమంగా, కష్టపడి భావం కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదని నాకు అనిపిస్తుంది.
సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు అయిన ఘంటసాల రచయిత కూడా. ఇది చాలా కొద్ది మందికి తెలిసిన విషయం. ఘంటసాల పాడిన లలిత గీతాల్లో చాలా శాతం ఘంటసాల రచించినవే. వాటిల్లో ఒక ఆణిముత్యం బహుదూరపు బాటసారి అన్న పాట. పాట వినడానికి ఎంత మధురంగా ఉంటుందో అందులోని అర్ధం అంత గాంభీర్యంగా ఉంటుంది.
బహుదూరపు బాటసారీ..
ఇటురావో ఒక్కసారీ...
అర్ధరాత్రి పయనమేలనోయి
పెను తుఫాను రేగనున్నదోయి
నాకుటీరమిదేనోయి
విశ్రమింపరావోయి
వేకువనే పోదమోయి
పయనమెచటికోయి నీ
దేశమేనటోయి
నా ఆశలు తీరెనోయి
నీతో గొని పోవోయి.
ఇలా పాట అంతా సాగుతుంది. మృత్యువు అంటే భయంలేని వ్యక్తి పాడుకునే పాటగా ఘంటసాల దీన్ని అభివర్ణించేవారట. ఇది కాక ఘంటసాల ఇంకా చాలా భక్తి గీతాలు, తాత్విక గీతాలు , వలపు గీతాలు కూడా రాశారు.
మొదటే చెప్పినట్టుగా ఘంటసాల గురించి ఎంతరాసినా తక్కువే అవుతుంది. చంద్రుడికో నూలుపోగు అన్న చందంగా ఘంటసాల జయంతి సందర్భంగా ఈ చిన్న వ్యాసంతో ఆయనకు నివాళులు సమర్పించుకుంటున్నారు. ఎన్ని తరాలు మారినా ఘంటసాల పాటలు తెలుగువారి గుండెల్లో మ్రోగుతునే ఉంటాయని..... ఉండాలని అభిలషిస్తున్నాను.
skip to main |
skip to sidebar
3, డిసెంబర్ 2010, శుక్రవారం
బ్లాగు ఆర్కైవ్
-
►
2011
(6)
-
►
సెప్టెంబర్
(2)
- ► సెప్టెం 06 (1)
- ► సెప్టెం 13 (1)
-
►
సెప్టెంబర్
(2)



13 కామెంట్‌లు:
ఘంటసాల గురించి మంచి విషయాలు గుర్తు చేశారు. ముఖ్యంగా పాటల రచయితగా ఆయన్ను స్మరించటం బాగుంది.
ఘంటసాల స్వరంలో ప్రస్ఫుటంగా వినిపించే గాంభీర్యం అనితర సాధ్యమనిపిస్తుంది. పౌరాణిక పద్యాలు ఆయన గొంతులో ఎంత గొప్పగా ధ్వనిస్తాయో! భగవద్గీత గానం నాకు అద్భుతంగా తోస్తుంది.
నా చిన్నపుడు ఘంటసాల చనిపోయిన వార్తను రేడియోలో విన్నాను. తర్వాత కూడా ఆయన పాటలు రేడియోలో ఎలా వస్తున్నాయో ఒకపట్టాన అర్థం కాలేదప్పుడు!
ఘంటసాల చౌటుపల్లి అని (అవనిగడ్డ తాలూకా అనుకుంటాను)బందరు దగ్గరి గ్రామంలో జన్మించారు. 11వ ఏట సంగీతం నేర్చుకోవాలనే తహతహతో ఇంట్లోంచి వెళ్ళిపోయి విజయనగరం చేరుకున్నారు. తదుపరి ఆయన చరితం తెలుగు జాతికి భగవంతుడిచ్చిన శాశ్వత వరం. తెలుగు వారందరికీ గుండె చప్పుడు కన్నా స్పష్టంగా వినబడే స్వరమాయనది. 52 సంవత్సరాల భౌతికగతిలో ఆయన జాతికిచ్చిన సాంస్కృతిక సంపదనెలా మాటల్లో కొలవగలం, ...ఆయన గంభీరమైన భక్తి పాటందుకుంటే నాస్తికుడు కూడా తొలవొగ్గి తల్లీనమై విన్నాడు. ఆయన డ్యూయెట్లు పాడితే ప్రతీ తెలుగు వాడూ తానొక తెరపై నాయకుడిగా పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన రంగస్థల పద్యాలు పాడితే పురాణ పురుషుల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని పొందాము. అనుకున్నది సాధించనప్పుడు, వియోగ విషాదల్లో మునిగినప్పుడూ, అయినవాళ్ళకోసం దిగులు పడ్డప్పుడూ ఆయన విషాదగీతమొక్కటైనా తలవక మానదు. హుషారుగా మనసు తేలికైనప్పుడు పాడుకోడానికి, ...ఇలా ఎంతని చెప్పగలం. శాస్త్రీయ సంగీతంలో మాధుర్యాన్ని దేశి సంగీతంగా మార్చి పండితపామరులని ఏకసందర్భంలో మెప్పించిన ఘనత ఆయనకున్నంతగా మరెవరికీ లేదని నా అభిప్రాయం.
తెలుగు నుడికారాన్ని, పలుకుబడినీ, ఉచ్చారణనీ, భావప్రకటననీ హృదయ కుహరాల దాకా జీర్ణించుకుని గళంలోంచి మనకందరికీ అంతకన్నా మధురంగా వినిపించాడు.
ఆయనకన్నా ప్రజాదరం ఉన్న గాయకులుండవచ్చు
ఆయనకన్నా ఇంకా ఖ్యాతి గడించిన గాయకులుండవచ్చు గాక
ఆయనకన్నా ఇంకా అతిగా అర్జించిన గాయకులుండవచ్చు గాక
కానీ 1940 నుండీ 1980 వరకూ పుట్టిన తెలుగువారందరి మనసుల్లోనూ ఒకడే ప్రథమతమ గాయకుడు - ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు.
అన్న VAK రంగారావు గారి మాటల్ని ఘంటసాల అంటే నాకున్న తబ్బిబ్బు కొద్దీ మరో సారి గుర్తు చేస్తున్నాను.
- తాడేపల్లి హరికృష్ణ ప్రసాద్
మనోజ్ఞ గారు, అమరగాయకునిపై చక్కని వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. అయితే చిన్న సవరణ. ఘంటసాలగారు పుట్టింది చౌట్‌పల్లి (గుడివాడ దగ్గర) లో. వారు సంగీతం అభ్యసించినది విజయనగరం సంగీత కళాశాలలో.
మృత్యువులేని పాట ఘంటసాల... మనో ఎలా ఉన్నావు.... మొత్తానికి బ్లాగింగ్ ఎక్కువగానే చేస్తున్నావు... ఇవాళ ఎరిక్ సీగల్-లవ్‌స్టోరీ చదివాను. ఏడుపొచ్చేలా రాశాడు. దొరికితే చదువు.. సీగల్ కవిత్వంలో ఓ కొటేషన్ రాస్తున్నాను...
నీ మరణం క్షణికం.. నా మరణం క్షణక్షణం...
నాకైతే బాగా నచ్చింది... చదువు
అన్నట్లు ఇటీవలే లాస్ట్ బ్రాహ్మిణ్ చదివాను. రాణీ శివశంకరశర్మ రాశారు.
ధన్యవాదాలు వేణుగారు. ఘంటసాల పాటలు రాసారని నాకూ ఈ మధ్యనే తెలిసింది. నేను ముందు ఆశ్చర్యపోయాను. అందుకే ఆ విషయాన్ని ప్రస్తావించాను. అవునండీ ఘంటసాల పద్యాలు పాడితే అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ గొంతే అలాంటిది. ఘంటసాలలాంటి గాయకుడు తెలుగు వారికి దొరకడం మన అదృష్టం.
హరికృష్ణగారు మీరు చెప్పింది నిజం. ఘంటసాల లాంటి గాయకుడు మరి లేడు ..రాడు కూడా. నాకూ ఆయనంటే విపరీతమైన అభిమానం...అందుకే ఆయన జయంతి అని తెలియగానే పోస్ట్ ద్వారా నా నివాళులు తెలుపుకున్నాను. ఇంకా ఘంటసాల ఊరు విజయనగరం అని రాసిన తప్పును సరిదిద్దుకున్నాను. నా తప్పును సరి చేసినందుకు ధన్యవాదాలు.
స్వగతంగారూ ధన్యవాదాలు. తప్పును సరి చేసానండీ. నా తప్పను సరిదిద్దినందుకు మరోసారి ధన్యవాదాలు.
రవీ ఎలా ఉన్నావు. అవునా ఎరిక్ సీగల్ పుస్తకం అంత బావుందా... ఇక్కడ దొరికితే చదువుతాను. నువ్వు తెలుగులో చదివావా... ఇంగ్లీషులోనా. ఈ మధ్య పుస్తకాలు బాగా చదువుతున్నట్టున్నావే. చాలా మంచిది. ఇంకా ఎక్కువ చదవడానికి ప్రయత్నించు. నేను కూడా పుస్తకాలు చదువుతున్నాను. ఇంగ్లీషును కూడా చదివి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
చాలా బాగా రాసావు, ముఖ్యంగా ఇద్దరు మితృల పాట గురించి మరియు ఘంటసాల పాటల రచన గురించి.
ఆ పాడవేల రాధిక పాట విన్నప్పుడల్లా నాకు ఇలాగే అనిపిస్తుంది.
ఆయన పాటలు రాస్తారని ఇప్పుడు నువ్వు చెప్పేవరకూ నాకు తెలీదు. మంచి వ్యాసం రాసావు, బావుంది.
నాకైతే భగవద్గీత చాలా ఇష్టం..నిజం గా దేవుడే చెప్తున్నట్టు గా ఉంటుంది..
ఆ కమ్మటి స్వరానికి శతకోటి వందనాలు..
పోస్ట్ బాగుందండి...
ధన్యవాదాలు వేణుగారు. ఘంటసాల గొంతులోని ఆర్ద్రత చాలా గొప్పదిండీ. దాని వల్లనే ఆయన భగవద్గీతను అంత గొప్పగా చదవగలిగారని నేను అనుకుంటున్నాను. ఘంటసాల చివరి రోజుల్లో భగవద్గీత చదివారని చెపుతుంటారు. అప్పికి ఆయన పరిపూర్ణ జీవితం అనుభవించారు కదా. ఆ పరిపూర్ణత కూడా అందులో కనిపిస్తుంది. ఘంటసాలే దేవుడండీ. పాటల దేవుడు.
కదా సౌమ్యా... నేను ఎప్పుడు ఆ పాట విన్నా చివరలో ఘంటసాల గొంతు విని గొప్ప ఆవేశానికి, పరవశానికి లోనవుతాను. దాన్ని మాటల్లో చెప్పడం కూడా కష్టమే. ఎంత బాగా పాడతారో....ఎప్పుడూ నా చెవుల్లో ఆ పాటలోని ఒక్క ముక్క మారుమ్రోగుతూనే ఉంటుంది. ఘంటసాల రచయిత అనీ నేనూ ఈ మధ్యే తెలుసుకున్నాను. బహుదూరపు బాటసారీ పాట ఎన్ని సార్లు విన్నానో, ఎన్ని సార్లు పాడుకున్నానో.. కానీ ఈ విషయం నాకు ఎప్పుడూ తెలీదు. తెలిసాక మాత్రం చాలా ఆశ్చర్యపోయాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి