వివిధ ప్రక్రియలకు మారుపేరు ఆరుద్ర. చిన్నచిన్న కవితల దగ్గర నుంచీ పెద్ద పెద్ద నవలలు, పరిశోధనాగ్రంథాల వరకు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో ఆరుద్ర ఒకరు. ముఖ్యంగా అభ్యుదయ సాహిత్య కృషిలో ఆరుద్ర పేరు చెప్పుకొని తీరవలసిందే. ఆరుద్ర రాసిన అన్ని ప్రక్రియలు ఒక ఎతైతే కూనలమ్మ పదాలు ఒక్కటీ ఒక ఎత్తు. ముళ్ళపూడి పెళ్ళికి కానుకగా రాసిచ్చిన కూనలమ్మ పదాలు తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడి సృష్టించాయని చెప్పవచ్చును.
నాలుగు పాదాల చిన్న చిన్న పద్యాల్లో జీవిత సత్యాలను ఆవిష్కరించారు ఆరుద్ర. అందరికీ అర్ధమయ్యే విధంగా అలతినలతి పదాలతో రాసిన కూనలమ్మ పద్యాలు చదివించేరీతిలో ఉంటాయి. ప్రతిపద రమణీయం.....చమత్కారంతో కూడిన కూనలమ్మ పద్యాలు సమకాలీన జీవితంపై వ్యంగ్యాస్త్రాలు. అందమైన భావాలతో మిళితమై.....ఓ కూనలమ్మ అనే చివర పదంతో ముగిసే ఈ పద్యాలలోని అందమంతా మొదటి మూడు పాదాలే. అంత్యప్రాసలతో అలరిస్తూనే ఆరుద్ర తన కూనలమ్మ పదాలలోని చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా.... పాఠకుడి హృదయంలోకి దూసుకెళ్ళేలా చెప్పారు. జానపద కళారూపాలైన కూనలమ్మ పదాలలో వస్తువైవిధ్యంతో కూడిన వర్తమాన సామాజిక జీవితంలోని వైరుధ్యాలను ఆవిష్కరించారు.
తెలుగు భాషపై ఆరుద్రకున్న పట్టు అనన్యసామాన్యం. ఇందుకు నిదర్శనమే కూనలమ్మ పదాలు. ఆయన రాసిన తెలుగు సినిమా పాటలూ ఇందుకు మినహాయింపేమీ కాదు. సాహిత్యం అర్ణవమైతే....ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే.....ఆరుద్ర విహరించిన ఎత్తుల్లేవు అని ఎవరో అన్న మాట అక్షరాల నిజం అని ఒప్పకోక తప్పదు. కూనలమ్మ పదాల్లో ఆరుద్ర సృజించని అంశం లేదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే శ్రీశ్రీ అంటారు.
కూనలమ్మ పదాలు
వేనవేలు పదాలు
ఆరుద్రదే వ్రాలు
కూనలమ్మ పదాలు
లోకానికి సవాలు
ఆరుద్రదే వ్రాలు
కూనలమ్మ పదాలు
కోరుకున్న వరాలు
ఆరుద్ర సరదాలు
ముచ్చటైన బాపూ బొమ్మలతో జ్యోతి పత్రికలో ఆనాటి తెలుగు ప్రజను ఉర్రూతలూగించిన కూనలమ్మ పదాలు చదువరులకు కోసం మచ్చుకకు కొన్ని.
సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ !
సామ్యవాద పథమ్ము
సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రదమ్ము
ఓ కూనలమ్మ !
సగము కమ్యూనిస్ట్
సగము కాపిటలిస్ట్
ఎందుకొచ్చిన రొస్టు
ఓ కూనలమ్మ !
శ్రీశ్రీ గురించి -
రెండు శ్రీల ధరించి
రెండు పెగ్సు బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ !
కృష్ణశాస్త్రి గురించి -
కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మ !
బాపు గురించి -
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
కూరుచుండిన కొమ్మ
కొట్టుకొను వాజమ్మ
హితము వినడు కదమ్మా
ఓ కూనలమ్మా!
హరుడు అధికుడు కాడు
నరుడు అల్పుడు కాడు
తమకు తామే ఈడు
ఓ కూనలమ్మా
నిజము నిలువని నీడనః
నీతి యన్నది చూడ
గాజు పెంకులగోడ
ఓ కూనలమ్మా
చెప్పి దేవుని పేరు
చెడుపు చేసెడి వారు
ఏల సుఖపడతారు
ఓ కూనలమ్మా
జనులు గొర్రెల మంద
జగతి వేసెడు నింద
జమకట్టు సుత్తి క్రింద
ఓ కూనలమ్మా
పాత సీసాలందు
నూతనత్వపు మందు
నింిపతే ఏమందు?
ఓ కూనలమ్మా
పాత బిరుదము కన్న
పదవియే కద మిన్న
హ్యూము చాటెను మొన్న
ఓ కూనలమ్మ
లంచమనియెడు ఉప్పు
క్లార్కు తింటే తప్పు
ఘనుడు తింటే మెప్పు
ఓ కూనలమ్మా.
skip to main |
skip to sidebar
24, నవంబర్ 2010, బుధవారం
బ్లాగు ఆర్కైవ్
-
►
2011
(6)
-
►
సెప్టెంబర్
(2)
- ► సెప్టెం 06 (1)
- ► సెప్టెం 13 (1)
-
►
సెప్టెంబర్
(2)



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి