22, అక్టోబర్ 2010, శుక్రవారం

ఎందుకు పారేస్తాను నాన్నా

                   గత శతాబ్దం మొదట్లో అన్ని రచనలను ప్రభావితం చేసిన అంశాలు రెండు ప్రభవించాయి. అవి ఒకటి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే జర్మన్ శాస్త్రకారుని మానసిక తత్వవిచారము, రెండు రష్యా తత్వవేత్త కారల్ మార్క్స్ ఆర్ధిక తత్వ విశ్లేషణ. మన తెలుగు రచనలకు సబంధించి ముఖ్యంగా వచన రచనలలో వీరేశలింగం, గురజాడ, శ్రీపాద ఈ ముగ్గురూ ఈ రెండు ప్రభంజనాలకు లోను కాకుండా రచనలు సాగించారు. చలం, బుచ్చిబాబు మొదలైన వాళ్ళు ఫ్రాయిడ్ విశ్లేషణ ప్రభావానికి లోనై తమ రచనలలో సెక్స్ కి పెద్ద పీట వేశారు. ఇక కుటుంబరావు, రావిశాస్త్రీ, చాసో మొదలగు వారు కారల్ మార్క్స్ సిద్ధాంతానికి పెద్ద పీట వేశారు.

                 కారల్ మార్క్స్ సింద్ధాంతానికి పెద్దపీట వేసినవారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కథా రచయిత చాసో. చాసో కథల్లో ఆర్థిక అంశాలే ప్రధానం. ఆర్ధిక విషయాలు ఒక్కొక్కళ్ళతో ఎటువంటి పనులు చేయిస్తాయో.... వారిని ఎలా తయారు చేస్తాయో చాసో తన కథల్లో చక్కగా చూపెట్టారు. వ్యక్తి జీవితంలోని సమస్త విషయాలను నిర్దేశించే బలీయమైన శక్తిగా ఆర్ధికాంశాన్ని వివిధ కోణాల్లో శక్తివంతంగా తన కథల్లో వ్యక్తీకరించారు చాసో. వ్యక్తుల సామాజిక, నైతిక ప్రవర్తని ప్రభావితం చెయ్యడం మాత్రమే కాక, మనుషులలో ఉండవలసిన మానవత్వాన్ని కూడా నియంత్రించే ఆర్థిక సత్యాలను తన కథల్లో బలంగా చూపెట్టారు. జీవితానుభవం నుంచి సాహిత్యం పుట్టాలి అని బలంగా నమ్మిన వారిలో చాసో ఒకరు. వ్యాఖ్యానాల ద్వారా సిద్ధాంతాలు వల్లించకుండా, పాత్రల ద్వారా సందేశాన్ని అందించడంలో చాసో దిట్ట. చాసో కథల్లో పాత్రల స్థితి గతులు చదువరుల కళ్ళ ముందు కనబడతాయి. వాటి జ్ఞాపకాలు కదిలిస్తాయి. శ్రామికులు పేదరికాన్ని ఆసరా చేసుకుని జేబులు నింపుకునే దుర్మార్గం, రెక్కలు, ముక్కలు చేసుకుని గుక్కెడు మంచినీళ్ళకు సంతసించే అమాయకత్వం, పేదరికం కారణంగా ఎదురయ్యే ఆటంకాలను అధిగమించలేని ప్రతిభ, సామాజిక గౌరవానికి అడ్డు నిలవలేని అక్రమ సంపాదన చాసో కథల్లో చోటు చేసుకుని ఆలోచనలు రేకెత్తిస్తాయి. కుంకుడాకు, ఏలూరెళ్ళాలి, లేడీ కరుణాకరం, ఎంపు మొదలగు కథలన్నీ ఇందుకు నిదర్శనాలే. చాసో రాసిన కథలు చాలా తక్కువ. కానీ ఆయన రాసిన ప్రతీ కథా మాత్రం ఓ అధ్బుతం.
                  
                           చాసో కథల్లో మరో ముఖ్యమైన అంశం భాష. మనుషులు మాట్లాడుకునే సాధారణమైన భాషలో కథలు రాసిన విశిష్టత చాసోది.విజయనగరం  జిల్లా వారైన చాసో అక్కడి కళింగాంధ్ర భాషనే తన కథలలో వాడుకున్నారు. అచ్చమయిన విజయనగరం యాస తెలుసుకోవాలంటే, ఆస్వాదించాలంటే చాసో కథలు చదివి తీరవలసిందే. చాసో కథల్లో రచయిత ఎక్కడా కనపడడు. పాత్రలు మాత్రమే ఉంటాయి. చాసో రాసిన కథలు అచ్చం కథల్లాగే ఉంటాయి. చాసో కథల్లో ఎక్కడా అనవసర సంభాషణలు , వర్ణనలు ఉండవు.
                      
                          చాసో కథలు అన్నీ మంచివే అయినా చిన్నప్పుడే నన్ను బాగా ఆకర్షించిన కథ మాత్రం ''ఎందుకు పారేస్తాను నాన్నా'' అన్న కథ. ఎంత మానుకోవాలనుకున్నా మానుకోలేక ఒంట్లో ఇంకిపోయిన చిన్న అలవాటుని కూడా ఆర్థికస్థితి ఎలా నియంత్రిస్తుందో ''ఎందుకు పారేస్తాను నాన్నా''లో మనసులకి హత్తుకునేలా చెప్పారు చాసో. కృష్ణుడు అనే చిన్న పిల్లవాడి గురించి మొత్తం కథంతా ఉంటుంది.ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక చదువు మానిపించేసిన తండ్రితోనే తిరిగి చదువుకోమని ఒప్పించడానికి కృష్ణుడు పడిన పాట్లు ఇందులో అందరినీ కదిలిస్తాయి. చదువుపై  కృష్ణుడికున్న మక్కువ, తపన కన్నీటిని పెట్టిస్తుంది.
                   
                         క్లాసులో తెలివైనవాడుగా గుర్తింపు వున్న బీదపిల్లవాడు కృష్ణుడు. మంచి మార్కుల ఉన్నా థర్డుఫారమ్‌లో చేర్చించే శక్తిలేక చదువు ఆపెయ్యమంటాడు తండ్రి. తనకు చదువుకోవడం చాలా ఇష్టమని ఎంత బతిమాలినా ఒప్పుకోడు.ఒకరోజు ఇంటిలో ఉన్న కృష్ణుడిని చుట్టలు తెమ్మని డబ్బులు ఇచ్చి పంపిస్తాడు తండ్రి. చుట్టలు కొనడానికి బయలుదేరిన కృష్ణుడు అదే దారిలో ఉన్న తన బడిని చూస్తాడు. బడిలోకి వెళుతున్న తన సహచరులను కలుస్తాడు.వాళ్ళ దగ్గరున్న కొత్త పుస్తకాలను చూస్తాడు.వాటి కొత్తదనపు పరిమళలాలను ఆఘ్రాణిస్తాడు. అంతే వాడికి తాను స్కూలులో చదువుకున్న పాత రోజులన్నీ గుర్తుకు వస్తాయి. ఎలా తాను, తన సహచరులు పోటీ పడి మరీ చదివిందీ గుర్తుకువస్తుంది.దాంతో పాటే తాను ఇప్పుడు చదువుకోలేక పోతున్న విషయమూ గుర్తుకు వస్తుంది కృష్ణుడికి. అంతే దు:ఖమూ తన్నుకు వస్తుంది. దాంతో అలా ఏడుస్తూ ఆ బడిలోనే కూర్చుండి పోతాడు.
                       
                         ఇంతలో చుట్టలు తేవడానికి వెళ్ళిన కొడుకుని వెతుక్కుంటు బయలుదేరుతాడు తండ్రి. చుట్టల కొట్టు దగ్గరుండవలసిన కొడుకు బడి దగ్గర కనిపిస్తాడు తండ్రికి. అదీ ఏడుస్తూ. అది చూసిన తండ్రి కృష్ణుడుని సముదాయించడానికి ప్రయత్నిస్తాడు.కానీ సముదాయించిన కొద్దీ కృష్ణుడు మరింత ఎక్కువగా ఏడవడం ప్రారంభిస్తాడు.చివరకు బడి స్తంభాన్ని పట్టుకుని తానిక్కడి నుంచి రానంటే రానని దొర్లి దొర్లి ఏడుస్తుంటాడు. కొడుకు దుఃఖం చూసిన తండ్రి కరిగిపోతాడు. చుట్టల ఖర్చు కొడుకు స్కూలు ఫీజుకి సరిపోతుందని ఆలోచించి, వాడి చదువు కొనసాగించడం కోసం చుట్టలు మానెయ్యడానికి నిశ్చయించుకుంటాడు. అదే విషయాన్ని కొడుక్కి చెప్పి వాడి బాధను తీరుస్తాడు. ఆద్యంతం ఆర్ధ్రంగా సాగిన ఈ కథలో, చదువుకోవాలన్న సహజమైన కోరికని నియంత్రించుకోవలసిన కృష్ణుడి దారిద్య్రపు దుర్భరత్వం, చదువుకోసం ఈ పసిమనసు పడ్డ తపన, దాన్ని అర్థం చేసుకున్న పితృప్రేమ హృదయాలని ద్రవీభూతం చేస్తాయి.కథ అంతా ఒక ఎత్తు అయితే చివరలో చుట్టలు కోసం ఇచ్చిన డబ్బులు ఉన్నాయా .... పారేశావా? అని తండ్రి అడిగినప్పుడు ''ఎందుకు పారేస్తాను నాన్నా'' అన్న కృష్ణుడు మాట ఒక ఎత్తు. ఆ ఒక్క మాటే కథకు ఆయువు పట్టు. అందుకేననుకుంటాను చాసో ఈ కథకు ఈ పేరు పెట్టారు.  విషయం చిన్నదే అయినా చాసో కథను మలిచిన తీరు అద్భుతంగా ఉండి పాఠకుల మనస్సులను హత్తుకుంటుంది.  చాసో అత్యుత్తమ కథకుడనడానికి ఈ ఒక్క కథే చాలు.













6 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

This is one of my all time favorite stories! ఆ స్కూలు వాతావరణం, ఆ పిల్లల మధ్య స్నేహ పూర్వకమైన పోటీ, చదువు మీద కృష్ణుడి ప్రేమా,(తల్చుకుంటే గుర్తొస్తుంది, నాకూ అంత ప్రేమ ఉండేది చదువు మీద అని) ఇవన్నీ నాకైతే కన్నెళ్ళు తెప్పిస్తాయి ఆ కథ లక్షో సారి చదివినా సరే! ఒకసారి కల్పనా రెంటాల గారు తన బ్లాగులో చాసో గురించి రాసినపుడు ఈ కథ గురించి రాయమని అడిగినట్లు గుర్తు! ఎందుకు రాయలేదో గొడవ పెట్టుకోవాలి.

మంచి కథ మనోజ్ఞా! ఇంకా అందులో వాయులీనం, పోనీ తిను, ఏకరువు,బూర్జువా కుక్క, ఊహా ఊరవశి అసలు మొత్తం కథలన్నీ ఆణిముత్యాలు!

మనోజ్ఞ చెప్పారు...

నాకూ కూడా అతే సుజాత గారూ, చెప్పాను కదా చిన్నప్పుడే ఈ కథ నన్ను ఆకర్షించింది. నేను కూడా చాసో కథలను ఎన్ని సార్లు చదివానో. అందులోని ఈ కథ గుర్తే లేదు....అన్నిసార్లు చదివాను. అందులోని చాసో మా విజయనగరం వారు కదా... మరీ ప్రత్యేక అభిమానం కూడాను.

ఆత్రేయ చెప్పారు...

చాసో గారి కధల గురించి చక్కగా వివరించి ప్రత్యేకంగా " ఎందుకు పారేస్తా నాన్న..." ప్రస్తా వించారు కానీ ఆ కధకు ఆ పేరు పెట్టడం లోని ఔచిత్యం రాయలేదు ఆ కధ చదవని వాళ్లకు ఆ కుతూహలం ఉంటుంది కదా
అంచేత ఆ పేరు ఎందుకు పెట్టి ఉంటారో కూడ వివరించండి
ధన్యవాదములు

మనోజ్ఞ చెప్పారు...

ఆత్రేయ గారు ముందుగా ధన్యవాదాలు. మంచి సలహా ఇచ్చారండీ. మీరు చెప్పినట్టు కధకు ఎందుకు పేరు పెట్టారో చివరలో చెప్పానండీ. వీలయితే ఒకసారి చూడండి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

చాసొ కధలు మూడో నాలుగో చదివాననుకుంటా. గుర్తు లేదు. ఈ కధ చదివిన గుర్తు లేదు. ఇది ఇప్పుడు చదవాలి.నాకు గుర్తున్నది మాతృధర్మం అన్న కధ.ఇది నేను రెండు మూడు మాట్లు చదివితె కానీ పూర్తిగా అర్ధం కాలేదు.
బాగా రాస్తున్నారు. చదివినవి మళ్ళి గుర్తుకు తెస్తున్నారు. థాంక్యూ.

మనోజ్ఞ చెప్పారు...

ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ. చాసో కథలు చాలా బావుంటాయి. చాసో కథలని ఒక సంపుటం ఉంది. మీకు వీలయితే దాన్ని చదవండి. అందులో మంచి కథలు ఉన్నాయి. ఇప్పడు నేను రాసిన కథ కూడా అందులో ఉంది.