రామాయణం...అందులోని పాత్రలు. రామాయణం గురించి, రాముడి గురించి, సీత గురించి, ఇంకా అందులోని మిగతా పాత్రల గురించి వర్ణనలు, సమీక్షలు, వివరణలు, కావ్యాలు, గీతాలు, కథలు, నవలలు ఓహ్ ఎన్ని వచ్చాయో లెక్కే లేదు.
రావణుడు....రామాయణంలో విలన్. సీతను ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు. రాముడు చేత చంపబడినవాడు. అంతేనా.....ఇంతకు మించి మరేమీ లేదా. రావణుడిలో మరో కోణం లేదా. వుంటే అది ఒకవేళ ఎలా ఉంటుంది. దీని గురించి ఆలోచించినవారు ఎంతమంది. బహుశా చాలా తక్కుగానే ఉంటారేమో. తెలుగులో ప్రముఖంగా రావణుడి గురించి కథలు రాసింది నాకు తెలిసి ఇద్దరు.అందులో ఒకరు గుడిపాటి వెంకటాచలం అయితే మరొకరు కొడవటిగంటి కుటుంబరావు.వీరిద్దరు రామాయణానికి వ్యతిరేకంగా రావణుడ్ని గొప్పగా చూపెడుతూ కథలు రాశారు. తమ తమ దృక్పథాల్లో రావణుడి గొప్పతనాన్ని చూపెట్టారు. ఇందులో నాకు నచ్చిన కథ.....కొకు రాసిన అశోకవనం.
అశోకవనం కథ అంతా రావణుడి దృష్టి నుంచి రాయబడింది. రావణుడిని పాజిటివ్ గా చూపెడుతూ చిత్రించబడింది. రామాయణంలో రావణుడు చాలా చెడ్డవాడు. కాని కొకు అశోకవనంలో రావణుడు మంచివాడుగానూ, ఆలోచనాపరుడుగానూ, శాంతహృదయుడూ, ప్రకృతి ప్రేమికుడుగానూ చూపెట్టబడతాడు. రామాయణం తెలిసిన వారందరికీ రావణుడిని మంచివాడిగా వూహించడం కష్టమే. కాని అశోకవనం కథ చదువుతుంటే మాత్రం మనలో ఆ భ్రమ తొలిగిపోతుంది. అందులో కొకు రావణుడిని చూపెట్టే పద్ధతి ఆకట్టుకుంటుంది.....ఆలోచనలో పడేస్తుంది.
అశోకవనం కథ సీతను రావణుడు ఎత్తుకెళ్లడం దగ్గర నుంచి హనుమంతుడు అశోకవనాన్ని తగలబెట్టేంతవరకు ఉంటుంది. ఇందులో రావణుడికి, సీతకు మధ్య జరిగే సంభాషణలు అద్భుతంగా ఉంటాయి. సీతాపహరణం గురించి రావణుడు ఆలోచిస్తున్నట్టుగా కథ మొదలు అవుతుంది. సీతాపహరణం తన వార్ధక్యంలో చాలా పెద్ద నిర్ణయం అని అనుకుంటున్నట్లు మొదలవుతుంది.పైగా అది చాలా హాస్యాస్పదంగా అనిపించి నవ్వుకుంటాడు.రావణుడు ముసలివాడు అయిపోయి హాయిగా చీకూ చింతా లేకుండా రాజ్యం చేసుకుంటున్న రోజుల్లో తాను ఇలాంటి పని చేయడమేమిటని ప్రశ్నించుకుంటాడు. ఈ పనికి కారణమైన తన చెల్లెలు శూర్పణఖ, మిగతా వారిని తిట్టుకుంటాడు. ఈ రకమైన ఆలోచన మనకు చాలా వింతగా, కొత్తగా అనిపిం చవచ్చును. కానీ కొంచెం ఆలోచించి చూస్తే ఇందులో కూడా నిజం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సీతను ఎత్తుకెళ్ళే కాలానికి రావణుడు నిజంగానే చాలా పెద్దవాడు. రాముడు పుట్టకమందు నుంచే రావణుడు రాజ్యం చేస్తున్నాడు. దేవతలందరినీ జయించి తనకంటూ ఒక సుస్థిర రాజ్యాన్ని ఏర్పరచుకుని హాయిగా పాలించుకుంటున్నాడు. అప్పటికే తనకు కావలసినవన్నీ పొంది ఉన్నవాడు. సీతలాంటి అపురూపసౌందర్యవతుల్ని చూసి ఉన్నవాడు. కాబట్టి సీతను అపహరించడం రావణుడికి చిన్నపిల్లల ఆటలా అనిపించింది. ఈ కథలో రావణుడు సీతను ఎత్తుకొచ్చింది కూడా రాముడికి బుద్ధి చెప్పడానికి మాత్రమే అని రాస్తారు కొ.కు. సీతను తీసుకెళ్ళడానికి రాముడు వచ్చినప్పుడు కొంచెం గట్టిగా మందలించి వదిలేద్దామని అనుకుంటాడు. పైగా రావణుడికి యుద్ధాలంటే విరక్తి కలిగిందని.....యుద్ధాల వల్ల ఒరిగేదేం లేదని రావణుడు తెలుసుకున్నాడని చెబుతారు. అందుకే కేవలం రావణుడు రాముడికి బుద్ధి చెప్పడానికి చిన్న నాటకం ఆడడానికి నిశ్చయించుకున్నాడని అంటారు. ఇదీ కొకు రావణుడి పాత్రకిచ్చిన రూపం. ఎంతో పెద్ద తరహాగా....హుందగా రావణుడు కనిపిస్తాడు. తర్వాత మొత్తం కథంతా కూడా ఇదే భావాన్ని కొనసాగించేలా ఉంటాడు కూడా.
కథలో సీతను చూడగానే రావణుడి మనస్సు చలిస్తుంది. తాను ఊహించినదాని కన్నా, శూర్పణఖ చెప్పినదానికన్నా ఎంతో అందంగా కనిపిస్తుంది.అయితే ఎంత మనసు చలించినప్పటికీ రావణుడు సీతను చూసి ఆనందిస్తాడే తప్ప.....ఏమీ చేయాలనుకోడు.కనీసం ముట్టుకోనైనా ముట్టుకోడు.ఒకప్పుడు అందమైన ఆడది కనిపిస్తే చాలు చరబట్టే రావణుడు ఇలా మారిపోవడం చాలా ఆశ్చర్యకమైన విషయం. రావణుడికి కూడా ఇలాంటి భావమే కలుగుతుంది.తానేంటి ఇలా మారిపోయడు అని అనుకుంటాడు.తాను ముసలి వాడయ్యాడా...లేక తనలో రసికత్వం మరింత పెరిగిందా అని సందేహపడతాడు. ఇలా అనుకుంటున్న సమయంలో రావణుడు అపహరించిన సీత మూర్ఛ నుంచి తేరుకుంటుంది. ఇక్కడ నుంచి రావణుడికి...సీతకు మధ్య సంభాషణ మొదలవుతుంది. సంభాషణ అంతా ఒక ముగ్ధ, అమాయకురాలు, తన భర్త మీద అపార నమ్మకమున్న స్త్రీకి........అత్యంత అనుభవజ్ఞుడు, వయస్సులో పెద్దవాడు అయిన ఒక పురుషునికి మధ్య జరుగుతుంది. సీత తాను చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అని అనుకున్న ప్రతీ మాటా రావణుడికి చిన్నపిల్లల మాటల్లా అనిపిస్తాయి. సీత అమాయకత్వం మీద జాలిని కలిగిస్తాయి. సీతను తనను చాలా అందగత్తెగా అనుకుంటూ...తనని తాను చాలా గౌరవించుకుంటూ...రావణుడ్ని చాలా చులకనగా చూస్తూ మాట్లాడుతుంది. ఇది రావణుడికి చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది.ఒకానొక సమయంలో నేను నీకెందుకింత అలుసు అయ్యాను అని కూడా అడుగుతాడు సీతను. తర్వాత సీతకు కిష్కింధ పర్వతాన్ని రావణుడే చూపెట్టినట్టు కొకు చెబుతారు. అప్పుడు కూడా సీత చాలా గొప్పగా తాను నగలు పడవేశానని....అవే రావణుడికి చావును తెచ్చిపెడతాయని చెబుతుంది. అప్పుడు రావణుడు నవ్వుకుంటాడు.సీతకు అర్థం కాక చూస్తుంటే తానే ఆ పర్వతాన్ని కావాలని చూపెట్టానని....రాముడికి వానరులు సహాయపడడం కోసమే అలా చేశానని చెప్పేసరికి సీతకు నోటి వెంట మాట రావడం కష్టం అవుతుంది.
ఇంక సీతను లంకకు తీసుకువచ్చిన రావణుడు తనకు ఎంతో ఇష్టమైన అశోకవనంలో ఉంచుతాడు. అప్పుడు సీతతో రావణుడు ఇలా అంటాడు. ఇది నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఎంతో అపురూపంగా పెంచుకున్నాను ఈ తోటను. నీలాంటి వాళ్ళు ఈ తోటలో ఉండడమే సరైనది. నీ రాకతో ఈ వనం అందం మరింత ఇనుమడించిందని చెబుతాడు.కానీ ఇది అర్థం చేసుకోలేని సీత మాత్రం అంత మంచి అంత:పురాలను వదిలేసి నన్ను ఈ చెట్ల మధ్యలో పడేస్తావా అని అడుగుతుందిఈ మాటతో రావణుడికి చాలా కోపం వస్తుంది. అంత:పురంలో ఉంటావా?...అక్కడ ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని కోప్పడతాడు.అలాగే సీతకు చెలికత్తెలుగా కొంత మంది రాక్షస స్త్రీలను ఉంచానని చెబితే....... సీత అమాయకంగా, తాను పారిపోకుండా ఉండడానికే తనకి వీరందరినీ కాపలా ఉంచాడని రావణుడ్ని నిందిస్తుంది.ఈ సారి రావణుడికి సీత మీద చాలా జాలేస్తుంది.ఆమె అమాయకత్వం నవ్వుతెప్పిస్తుంది.అలాగే నవ్వుతూ ఏంటీ నువ్వు ఈ లంక నుంచి తప్పించుకుని వెళ్ళగలవా.....ఈ ఎత్తైన ప్రాకారాలు దాటిపోగలవా.....అందుకే నేను వీరందరినీ నీకు కాపలాగా పెట్టానా అని వెటకారంగా అడుగుతాడు. ఇక్కడ నుండి రావణుడి కష్టాలు మొదలవుతతాయి. సీత ప్రతీసారి రావణుడితో ఇలాగే అర్థ లేకుండా, అమయాకంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇది కొన్ని సార్లు రావణుడికి చాలా చిరాకు కలిగిస్తుంది. అలాగే రాముడి గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు రాముడు వస్తాడని.....రావణుడి అంతు చూస్తాడని చెబుతూ ఉంటుంది. ఇలా చెబుతున్నప్పుడు రావణుడికి ఒకసారి ఒళ్ళు మండి నేనే రాముడిని అయితే ఈ పాటికే వచ్చి నిన్ను ఈ చెర నుంచి తప్పించుకుని తీసుకెళ్ళిపోయేవాడినని చెబుతాడు. అంతే కాదు రాముడిలా సమయాన్ని వృధా చేస్తూ....వాళ్ళ సహాయం కోసం, వీళ్ళ సహాయం కోసం అర్థించనని హేళన చేస్తాడు.
ఇలా గడుస్తున్న రోజులలో రావణుడికి చాలా బాధాకరమైన విషయం జరుగుతుంది. రావణుడు సగం చచ్చినరోజు కూడా ఇదే. సీత జాడ తెలుసుకోవడానికి వచ్చిన హనుమంతుడు వెళ్ళే ముందు అశోకవనాన్ని తగలబెట్టేస్తాడు. మంచి నిద్రలో ఉన్న రావణుడు బయట జరుగుతున్న కలకలం విని పరుగెట్టుకుని అశోకవనంలోకి వస్తాడు. అక్కడ పరిస్థితిని చూసి కుప్పకూలిపోతాడు. ఏదో జంతువు వచ్చి ఈ పని చేసిందని తెలుసుకుంటాడు. ఇంత చక్కటి వనాన్ని తగలబెట్టడానికి చేతులు ఎలా వచ్చాయని విలపిస్తాడు. అంతటి దు:ఖం లోనూ రావణుడికి సీత గుర్తుకువస్తుంది. సీతకు ఏమీ జరగలేదు కదా అన్న ఆదుర్ధా కలుగుతుంది. సీత ఏదంటూ వెతకడానికి లేస్తాడు. కానీ ఇంతటిలో సీతే అక్కడి వస్తుంది. అదీ ఎలా నవ్వుకుంటూ, నాట్యం చేస్తూ ఆనందంగా. రావణుడి దగ్గరకు వచ్చిన సీత చుట్టూ వున్నది చూపిస్తూ.....ఇందతా రాముడు మనుషులే చేశారని, ముందు ముందు రావణుడి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ఆనందంగా చెబుతుంది.కానీ రావణుడు దు:ఖంలో ఉంటాడు. సీత ఆనందంగా ఉండటం రావణుడికి ఇష్టమే అయినా ఆ పరిస్థితుల్లో అది అనుభవించే స్థితిలో లేడు. అంత బాధతో నన్ను చూడటానికి వస్తే ఈ వనాన్ని నాశనం చెయ్యడం ఎందుకు...మీ వాళ్ళకు ఈ మాత్రం సౌందర్యపిపాశ కూడా లేదా అని అడుగుతాడు.అప్పుడు వారిద్దరి మధ్యా నడిచిన ఈ కింది సంభాషణ కథ మొత్తంలో ఎన్నదగినది. ఆ సంభాషణ ఇలా ఉంటుంది.
''అయినదానికి ఎందుకు చింతిస్తావు....కాగల దానిలో సహస్రాంశం లేదు! అన్నది సీత పరిహాసంగా''.
''నేను నిన్ను ఏమైనా చెయ్యదలుచుకుంటే అంతే! కానీ నిన్ను నేనేమీ చెయ్యదలుచుకోలేదు. కనుక అయిపోయిన దానిలో కాగలది సహస్రాంశమైనా లేదు అంటూ రావణుడు తల వంచుకుని వెళ్ళిపోతాడు''.
''సీత ఆ వృక్షశవాల మధ్యే వుండి వెళ్ళిపోతున్న రావణుడి వంక చూస్తూ నిలబడ్డది. ఆమె మెదడులో కొంచెం కదలిక కనబడ్డది.
ఇక్కడతో కథ ముగించేస్తారు కుటుంబరావు. కానీ మనకు మాత్రం ఆ భావం కలగదు. మనకు మళ్ళీ కథ మొదలవుతుంది. సీతలాగే మన మెదళ్ళు కూడా ఆలోచించడం మొదలుపెడతాయి. రామాయణాన్ని తరచి చూస్తాం. కొకు లా ఎందుకు ఆలోచించకూడదని అనుకుంటాం. చాలా మథనపడతాం. అశోకవనం కథ మళ్ళీ మళ్ళీ చదువుతాం.
అశోకవనం కథ ఒక కల్పన...... అందమైన కల్పన. అర్థవంతమైన వూహ. ఒక వ్యక్తిని ఎప్పుడూ ఒకేలాగ చూడకూడదు అన్న దానికి అర్థం చెప్పిన కథ.మనలో నాటుకుపోయిన భావాలను వెలికితీసి..... పాతను చెరిపేసి కొత్తను అలవరిచే పెద్ద పాఠం. ఇది నా అనుభవంలో జరిగిన నిజం. నాకు ఆలోచన నేర్పించిన కథల్లో ఇది ఒకటి.



1 కామెంట్:
అశోకవనం కల్పన మాత్రమే కాదేమో... కల్పనలోంచి వచ్చిన మరో ఊహ... రామాయణమే కల్పన అనుకుంటే. వెంటనే అశోకవనం చదవాలనుకుంటున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి