6, సెప్టెంబర్ 2011, మంగళవారం

మహాభారతంలో కృష్ణుడు

                          కృష్ణుడు.....విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం.....చాలా ముఖ్యమైన అవతారం. ఎన్నో మహిమలు కలిగి.....ఎంతో మంది దుష్టులను సంహరించిన అవతార పురుషుడు. అలాగే చిలిపి చేష్టలతో గోపికల మనసులను దోచిన గోపీ వల్లభుడు....16వేల మందికి భర్త. ఇదీ మనకు బాగా సుపరిచితమైన కృష్ణుడు. అయితే కృష్ణుడులో మరో కోణం ఉందా?భాగవతంలో కనిపించే కృష్ణుడు....మహాభారతంలో కనిపించే కృష్ణుడు ఒకరేనా.......అన్నది పరిశీలించవలసిన అంశం. అంతే కాదు కృష్ణుడు జీవించిన విధానాన్ని కూడా గమనించవలసి ఉంటుంది.మహా భారత యుద్ధ సమయంలో అర్జునుడికి భగవద్గీతను బోధించి....మనుషులు జీవించవలసిన రీతిని బోధించిన కృష్ణుడు ఏ విధంగా జీవించాడో తెలుసుకోవాలి.

                                  మహాభారతం ఏ కొద్దో చదివిన వారికెవరికైనా మొదట వచ్చే సందేహం ఇదే. ఎందుకంటే భాగవతంలో కృష్ణుడు....భారతంలో కృష్ణుడు ఒకటి కాదు.భాగవతంలో కృష్ణుడు గోపీ వల్లభుడు.....ఎన్నో మహిమలు కలిగిన వాడు.కానీ భారతంలో కృష్ణుడు రాజనీతిజ్ఞత్వం కలిగిన మహాపురుషుడు....అందరిలాగే మానవుడు.మహాభారతంలో ఆది పర్వం సమాప్తమవుతుండగా వచ్చిన కృష్ణుడు చివర వరకు పాండవులకు అండగా ఉంటూ వారిని అనేక చిక్కులనుండి తప్పించిన రాజనీతికుశలుడు.పాండవులకు సహాయపడడంలో కూడా కృష్ణుడు ఎక్కడా తన మహిమలను వాడినట్టు కానీ మాయలు చేసినట్టు కానీ కనిపించదు.ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే అవి కేవలం ఒకటి రెండు సందర్భాలు మాత్రమే కనిపిస్తాయి.

                                  మొట్టమొదటిసారిగా మహాభారతంలో ద్రౌపదీ స్వయవరంలో కృష్ణుడు ప్రస్తావన వస్తుంది. అక్కడ నుంచీ ఒక్క మహాప్రస్థాన పర్వం మినహాయించి కృష్ణుడు రాని పర్వం ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చును. ధర్మరాజు జూదమాడి రాజ్యం పోగొట్టుకునే సంఘటన మాత్రం కృష్ణుడు అక్కడలేని సమయంలోనే జరుగుతుంది. ఉండి ఉంటే మహాభారతం మరోలా ఉండేదేమో... అలాగే పండ్రెండు సంవత్సరాల వనవాసంలో కృష్ణ...పాండవుల కలయిక తక్కువగానే ఉంటుంది. అయితే కృష్ణుడు మాత్రం వారి వెన్నెంటే ఉంటాడు. అవసరమైనప్పుడు వచ్చి సలహాలు...సంప్రతింపులు జరిపి పోతూ ఉంటాడు.ఇక విరాటపర్వంలో గోగ్రహణ సమయంలో పాండవులు, కౌరవులను కొట్టి తరిమి వేసే ఘట్టం మినహాయించి,కృష్ణుని సహాయం లేకుండా పాండవులు సాధించిన ఘనకార్యమేదీ లేదు.

                              మహాభారతంలో దర్శనమిచ్చే కృష్ణుడు హరివంశపురాణంలోనూ, భాగవతాల్లోనూ కానవచ్చే కృష్ణుని కంటే పూర్తిగా భిన్నుడు. మహాభారతంలో కృష్ణుడు పెద్దవయస్పులో ద్వారకావాసుడైన మీదట వస్తాడు. కృష్ణుని భార్యలలో ఒక్క సత్యభామ మాత్రమే ఇందులో ప్రముఖంగా కనిపిస్తుంది.రుక్మిణి పేరు ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే వస్తుంది. మహాభారతంలో వర్ణితుడైన కృష్ణునిలో ఎక్కడా కూడా అతని గోపీ వల్లభత్వపు జాడే లేదు. ఆ కాలంలో క్షత్రియరాజులందరి సంపత్తిలోనూ గోధనం కలిసి ఉంటుండేది. రాజుకు స్వంత గోప బృందం కూడా ఉంటూ ఉండేది. విరాట రాజుకు కూడా ఇలా ఉందని హహాభారతంలో మనకు కానవస్తుంది. అలాగే ఆ కాలపు ఆచారాన్ని అనుసరించి కృష్ణుడు చాలా మంది స్త్రీలను జయించి తీసుకుని వస్తాడు.కృష్ణార్జునుల సంభాషణలలో ఈ విషయం స్పష్టంగా అవగతమౌతుంది. కానీ ఎలాగైతే అర్జునుడు అనేక మంది స్త్రీలను జయించి స్త్రీలంపటుడు కాడో.....అలాగే కృష్ణుడు కూడా స్త్రీలంపటుడు కాడు.మహాభారతం ప్రకారం ఆ రోజుల్లో రకరకాల స్త్రీలను జయించి తీసుకొనిరావడం ప్రేమద్యోతకం కంటే రాజనీతిలో ఒక భాగంగానే పరిగణించబడవలసి ఉంటుంది.

                              కృష్ణునికి పాండవులతో గల సంబంధాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఆయన సమగ్రజీవితాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది.భగవద్గీతలో ''నమేపార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన''అని చెప్పే కృష్ణుని జీవితంలో చాలా కార్యాలు జరుగుతాయి.అందులో నీతి పరాయణత్వం కూడా ఉంటుంది. కొన్ని కులానికి సంబంధించినవి, కొన్ని ఆనాటి క్షత్రియవర్గ విషయకమయినవి, మరికొన్ని కేవలం స్వపరమైనవి.వాటిల్లో కంసవధ స్వపరమైనది అయితే.....జరాసంధుని చంపించడం,ధర్మజుని చేత రాజసూయయీగం చేయించడం వంటివి కులానికి, క్షత్రియపర అంశాలకి సంబంధించినటువంటివి. ప్రతీక్షణం జాగురూకుడుగా ఉండి యాదవులలో దెబ్బలాటలు జరగకుండా చూసుకుంటూ...వారందరినీ ఒకేతాటిపై నడిపించడం కూడా కృష్ణుడి విధుల్లో ఒకటిగా కనిపిస్తుంది. కేవలం దీని కోసమే తన అన్నయైన బలరామునికి పట్టం కట్టి తాను వెనుకనుండి అన్నీ నడిపిస్తాడని కూడా అనిపిస్తుంది. జరాసంధ వధ పని యాదవ వంశానికి ఎంతగా సంబంధించినదో అంతగానూ సమస్త రాజవంశాలను ఒకతాటిపై నడిపే ఏర్పాటుచేసే ఆయన కృషికి నిదర్శనం కూడా.

                                    మొత్తం చరిత్రలో కృష్ణునికి వ్యక్తిగతమైన లాభం జరిగినట్లు కనబడదు. కృష్ణుడు జరిపించిన రాజనీతి అంతా వంశం కొరకు, రాజకీయ సంబంధాల కొరుకు మాత్రమే. అయితే కృష్ణునికి తన స్వంత ఆకాంక్ష లేదా అని మనకు అనిపిస్తుంది. కృష్ణుని భగవంతుడిగా చూస్తే......దేవుడికి కోరికలు ఏమిటి...దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆయన పని సర్దిచెప్పుకోవచ్చును. కానీ మహాభారతంలో కృష్ణుడు మహాపురుఫుడిగా కనిపిస్తున్నాడు కదా అలాంటప్పుడు ఆయనకు ఏదో ఒక కాంక్ష ఉండి తీరాలి కదా అని ఆలోచించాల్సి వస్తుంది.శూర వీర పరాక్రముడై ఉండి కూడా అర్జుని వలె తమ్ముడు కావడం మూలాన రాజు కాలేకపోయాడు.రాజయితే కాలేకపోయాడు కానీ కృష్ణుని మనస్పులో ఏదో గొప్ప కోరిక ఉండేదని మాత్రం అనిపిస్తుంది. మహాభారతాన్ని తరచి చూస్తే అది వాసుదేవుడు కావడం అనిపిస్తుంది.వాసుదేవడం కావడం అంటే సరియైన అర్థం మహాభారతంలో ఇవ్వబడలేదు కానీ అదొక గొప్ప విషయంగా కనిపిస్తుంది.కృష్ణుడు తండ్రి వసుదేవుడు కాబట్టి కృష్ణుడు వాసుదేవుడు అవుతాడు కదా అని సందేహం వస్తుంది. కేవలం అదేనా అని అనుమానం కలుగుతుంది. కానీ అలాయితే వసుదేవుడి కుమారులు అందరూ వాసుదేవులు అవుతారు.అప్పుడు కృష్ణుడు గొప్పతనం చూపించుకోవడం ఎలా అవుతుంది. కాబట్టి అది కాదు. మహాభారతాన్ని పరిశీలిస్తే ఈ వసుదేవత్వం కోసం కృష్ణుడితో పాటుమరో ఇద్దరూ పోటీ పడినట్లుగా కనిపిస్తుంది. ఒకరు జరాసంధుడు అయితే మరొకరు శిశుపాలుడు. భీముడు జరాసంధుణ్ణి చంపుతాడు. యుధిష్టరుని రాజసూయయాగంలో కృష్ణునికి అగ్రతాంబూలం లభిస్తుంది. అందు నిమిత్తమైన శిశుపాలవధ కూడా జరుగుతుంది. దీంతో కృష్ణుడు దేనినైతే సంపాదించాలని కష్టబడ్డాడో అది నెరవేరుతుంది. పాండవులు ఇంద్రప్రస్థంలో విజయులై చక్రవర్తి పదవిని అధిస్టిస్తారు. కృష్ణుడు, పాండవుల జీవితంలో ఈ ఘట్టం మహోన్నతమైనది. కృష్ణుడికి అయితే కుటుంబపరమైన, సమాజపరమైన, వ్యక్తిపరమైన, మహత్వాకాంక్షలన్నీ నెరవేరుతాయి.

                                       ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఈ కృష్ణుడి ప్రయాస అంతా పాండవుల తెలివితక్కవతనం వల్ల నాశనం అవుతుంది.కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు రాజ్యాన్నీ, సర్వస్వాన్ని పోగొట్టుకుంటారు.శ్రీకృష్ణుని లక్ష్యాలు చాలా వ్యాపకమైనవి అయినప్పటికీ అవి పాండవుల సుఖదు:ఖాలతో ముడిపడి ఉంటాయి. పాండవులు సుప్రతిష్టులై ఉండడం కృష్ణునికి చాలా ముఖ్యం. పాండవులు ఓడిపోవడంతో కృష్ణుని వాసుదేవత్వం స్థిరపడిపోతుంది,అతని గొప్పతనం నిలిచిపోతుంది.కానీమిగిలినదంతా తుడిచిపెట్టుకుపోతుంది.పాండవులు రాజ్యం పోగొట్టుకోవడంతో క్షత్రియవంశాల మధ్య నెలకొని ఉన్న సంబంధబాంధవ్యాలు మట్టికలిసిపోతాయి. కృష్ణుని మిత్రప్రేమ ఒక్కటే నిలిచిపోయింది. కృష్ణుడికి, పాండవులకి మధ్య ఉన్నది రాజనీతిజ్ఞత్వం ఒక్కటే కాదు.అవాజ్యమైన ప్రేమ అని నిరూపింపబడుతుంది ఈ కాలంలో. పాండవుల వనవాసకాలంలో కంటికిరెప్పలా వాళ్ళని కాపాడుతుంటాడు కృష్ణుడు. వారు వనవాసం నుంచి తిరిగి వచ్చాక యుద్ధాన్ని నివారించడానికీ, సంధి చేయడానికి తన యావచ్ఛక్తిని వినియోగిస్తాడు. పరాకాష్ట వరకు వెళతాడు. చివరకు కర్ణుడిని కూడా ప్రలోభానికి గురిచేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ ప్రయత్నాలు అన్నీ నిష్ఫలమౌతాయి. చివరకు పాండవుల వెన్నుదన్నుగా నిలబడి యుద్ధం చేయిస్తాడు. వారి రాజ్యం వారికి అప్పగిస్తాడు. దీనివల్ల కృష్ణుడికి ఒరిగేదేమీ ఉండదు. కొన్ని విషయాల్లో అయితే హానే జరుగుతుంది. అయినప్పటికీ యుద్ధాన్ని తన కర్తవ్యంగా భావిస్తాడు.ముఖ్యంగా కృష్ణుని మనోగతం అంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ''యస్త్విన్ద్రియాణి మనసా'' అని భగవద్గీతలో తానే చెప్పినట్టుగా జ్ఞనేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా అసక్త భావంతో కర్మయోగాన్ని ప్రారంభించడమే మానవునికి అత్యంత విశిష్టమైనది ఆయన ధృడ అభిప్రాయం. పైగా కృష్ణుడు దృష్టిలో ఇదొక మిత్రకార్యం. ముఖ్యంగా కృష్ణుడు, అర్జునుడి మధ్య ఉన్న ప్రేమ అనన్యమైనది. కృష్ణార్జునుల శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే. ఒకరు మనసులో ఉన్నది ఒకరు తెలుసుకోగలిగేంత అనుబంధం వారిద్దరి మధ్యా ఉంటుంది. కృష్ణుడు జీవితపర్యంతం అర్జునుడిని ప్రేమించినంతగా మరెవరినీ ప్రేమించడు.

                                          మహాభారతంలో కృష్ణుడు తన అసాధారణ పరాక్రమాలతో అందరికీ రాజ్యాలు సంక్రమింపజేస్తాడు. ఇలాంటి పాత్రే మహాభారతంలో మరొకటి ఉంటుంది. అది భీష్ముడు. అయితే ఇక్కడ భీష్ముడు భోగరహితుడుగా ఉంటాయి. కానీ కృష్ణుడు సిరిసంపదలతో అన్నీ అనుభవిస్తాడు. భీష్ముడు కొంతవరకు అధికారం అనుభవిస్తాడు కానీ కృష్ణుడి భోగం అధికార రహితమైనది.ఒకరు అన్నీ త్యాగం చేసి కొంచెం అధికారం అనుభవిస్తే...మరొకరు సర్వం అనుభవిస్తూ కూడా నిర్లిప్తుడుగా ఉంటాడు. మహాభారతంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఏడ్చినట్లో, బాధపడినట్లో కనిపిస్తుంది. కృష్ణుడు మాత్రం ఎక్కడా ఏ సందర్భంలోనూ కంటతడిపెట్టడు. నిష్కామంగా ఉంటాడు. ఎంతగా అంటే అప్పుడప్పుడు కఠోరుడుగా అనిపించేటంతగా. ఈ కాణంగానే మహాభారతంలో కృష్ణుడు పట్టులోనికి రాడు. అసాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు. బాధ, ప్రేమ, ఆనందం అన్నీ అనుభవిస్తాడు. కానీ వాటిలో లిప్తుడు కాకుండా ఉంటాడు. ''సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై'' అన్నట్టు గా ఉంటాడు. ''ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే'' అన్నట్టుగా రాగద్వేషాలకు లోబడకుండా కర్మయోగిగా నిలిచిపోతాడు. ఆయన భగవద్గీతను కేవలం గానం చేయడమే కాదు....దాని ప్రకారం జీవిస్తాడు కూడా.



16 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మళ్ళీ వస్తా :-) చాలా పెద్దపోస్టు కదా, పేద్ద వ్యాఖ్యతో...

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది.
మీ పరిశోధనకి వ్యాసభారతం మూలమా, కవిత్రయ భారతమా?
లిప్తుడు కావడం అంటే ఏవిటో వివరించగలరు.
కృష్ణుని చలించని తత్త్వాన్ని చివరి పేరాలో బాగా చెప్పారు. అదే కదా స్థితప్రజ్ఞత.
వాసుదేవుడు అనేది ఒక పదవో, ఒక బిరుదనామమో అనుకోవచ్చా? ఎక్కడ జరాసంధుడూ శిశుపాలుడూ ఈ విషయంలో కృష్ణునికి పోటీవచ్చారు? పౌండ్రక వాసుదేవుడని ఒకడుండేవాడు. వాణ్ణి కూడా కృష్ణుడు చంపేస్తాడు. ఈ వాసుదేవత్వాన్ని గురించి ఇంకేమన్నా తెలిస్తే కొత్త వ్యాసం రాయండి.

మనోజ్ఞ చెప్పారు...

ధన్యవాదాలు కొత్తపాళీ గారు. వ్యాస భారతం చదివే స్థాయికి నేను ఇంకా ఎదగలేదు. కవిత్రయ భారతమే చదువుతున్నాను. ఇంకా మహాభారతం మీద వచ్చిన వ్యాసాలు, పరిశోధనలు కూడా నా వ్యాసానికి మూల కారణాలు. లిప్తుడు అవడం అంటే వశం కావడం, లోబడడం, కట్టుబడడం లాంటి అర్థాలు వస్తాయి. కృష్ణుడు అన్నీ అనుభవిస్తాడు కానీ వేటీకీ వశం కాడు. అదే చెప్పదలుచుకున్నాను. వాసుదేవత్వం అనేది చాలా గొప్పదైన ఒక స్థానం అని భావించాలని నా ఉద్దేశ్యం. అందుకే దాని కొరకు చివరి వరకు కృష్ణుడు ప్రయత్నించాడనిపిస్తుంది. రాజసూయయాగంలో శిశుపాలుడు కృష్ణుడిని అడ్డుకుంటాడు. ఆయనకు అగ్రతాంబూలం ఇవ్వకుండా అడ్డుపడాలని చూస్తాడు. శిశుపాలుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కృష్ణుడి కంటే అధికంగా ఉండాలని ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అలాగే జరాసంధుడు కృష్ణుడికి బద్ధ వైరి. భారతం గమనిస్తే వారిద్దరి మధ్య ఎప్పడూ వైరం ఉన్నట్టు కనబడుతుంది. అదీ కాక జరాసంధుడు లోకకంటకుడు కూడా. అందుచేతనే కృష్ణుడు భీముడి చేత అతనిని చంపిస్తాడు. పౌండ్రక వాసుదేవుని గురించి నేను విన్నాను. కానీ పెద్దగా వివరాలు తెలియవు. ఇక కృష్ణుని గురించి చెప్పాల్సింది చాలా ఉంది. పరిశోధించాల్సింది కూడా. మరింత చదివి మళ్ళీ రాస్తాను.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఈ టపా గురించి చర్చించే టంతటి జ్ఙానము నాకు లేదు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారి 'మన పురాణాలలో కృష్ణులెందరు' అనే వ్యాసం చదివాను. అందులో ఆయన ఏమన్నారంటే

ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కడు శ్రీకృష్ణునిగా జన్మించినట్టు కనిపిస్తుంది. తత్వతః ఒకే శక్తి అయినా, భాగవతంలో విష్ణువు, హరివంశంలో నారాయణుడు, బ్రహ్మ వైవర్తంలో గోలోక నాయకుడు ద్విభుజుడైన కృష్ణుడు, సాత్వతేయ సంహితలో పరవాసుదేవుని అంశలోని వాసుదేవుడు, కృష్ణ యామళంలో విష్ణువు, గోలోక నాయకుడు కలసిన రూపము, తరువాత నరనారాయణ మహర్షుల లోని నారాయణుడు కృష్ణుడిగా అవతరించాడని చెబుతున్నాయి. ప్రసిద్ధి మాత్రం విష్ణు కృష్ణునికే.

ఆయన తో మాట్లాడే అవకాశం రెండు మాట్లు వచ్చినా, దీని గురించి అడిగే అవకాశం దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు మీ వ్యాసం లో కొంత చర్చ చూశాను. మీ తరువాత వ్యాసాలకి ఎదురుచూస్తున్నాను.

మనోజ్ఞ చెప్పారు...

బాబోయ్ ఇంత మంది కృష్ణులు ఉన్నారా? ఒక్క కృష్ణుడి గురించి తెలునుకోవడానికే నాకు చాలా ఏళ్ళు పట్టింది. ఇంక అంత మంది గురించి తెలుసుకోవడం ఎలా. మీరు నాకు కొత్త విషయాన్ని పరిచయం చేశారు. నాకు ఇంతమంది కృష్ణులు ఉన్నారని అసలు తెలియదు. ఇకపై అది కూడా తెలుసుకోవాలి. ధన్యవాదాలు సుబ్రమణ్యంగారు.

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాసారు. ఆసక్తికరంగా అనిపించింది.
అయితే నాక్కొన్ని విషయాలు అర్ధం కాలేదండీ!

1. కృష్ణుడికి వాసుదేవత్వం గురించిన ఆశ యెందుకు? అలాగే జరాసంధుడూ, శిశుపాలుడూ "వాసుదేవత్వానికి" పోటీ వచ్చారని కాదేమో, వాళ్ళని వధించింది. మీరన్న "దుష్ట శిక్షణ, శిష్ట రక్షణా" ప్రోగ్రాంలో భాగంగా అయివుండొచ్చు. (నాకు పెద్దగా తెలియదనుకోండీ!)
2. కృష్ణుని ఆకాంక్షలకూ పాండవుల అభివృద్ధికీ ఏమిటి సంబంధం? "రాజనీతి అంతా వంశం కొరకు" అన్నారు మీరు. ఎవరి వంశం కొరకు? పురు వంశమే అయి వుండాలి. మరి అలాటప్పుడు కౌరవ-పాండవుల స్పర్థ మంచిదే కదా?(ఆయన దృష్ట్యా). "దుష్ట శిక్షణ" రీత్యా చూసినా, కురు-పాండవ యుధ్ధంలో కురు వంశం నాశనం కాక తప్పదని ఆయనకి తెలిసే వుండాలి. మరి అలాటప్పుడు సంధి ప్రయత్నాలతో యుధ్ధం ఎందుకు నివారించాలనుకున్నారో?

ఏదేమైనా, ఫిలసాఫికల్ గా, పొలిటికల్ గా కృష్ణుడిదొక ఆకర్షణీయమైన కాంప్లెక్సు వ్యక్తిత్వం అనిపిస్తుంది.
శారద

రవికిరణ్ పంచాగ్నుల చెప్పారు...

కృష్ణుడిని రెండు కోణాల్లోంచి బాగా వివరించారు మనోజ్ఞగారూ..

ఈ రెండు కోణాలే నాకు తెలియదు అనుకుంటే, బులుసుగారు చెప్పిన అంతమంది కృష్ణులగురించి తెలుసుకోవాలంటే ఏంచెయ్యాలో??

మనోజ్ఞ చెప్పారు...

అదేనండీ నా బాధ కూడా కూడా రవిగారు. చచ్చీచెడీ ఏదో కష్టపడి కృష్ణుడి గురించి కొంత తెలుసుకున్నాను అంటే ఇప్పడు ఈ బులుసుగారు కొత్త కృష్ణులను తెచ్చిపెట్టారు నా బుర్రలోకి.

Mangesh Devalaraju చెప్పారు...

మీ విశ్లేషణ బాగుంది...కృష్ణులు ఎంతమంది అన్న విషయము పక్కన పెట్టండి. మనకు తెలిసిన కృష్ణుని గురించి తెలుసుకుందాం.

నాకు అవగతమైనంతలో...

"ఏకం సత్ విప్రా బహుదా వదంతి" ఒకే విషయాన్ని తెలిసినవారు అనేక విధాలుగా తెలియచేశారు. అలాగే ఒకే ఒక కృష్ణ తత్వాన్ని ఎవరికి అవగతమైనంతగా, అవగతమైనట్లుగా వారు అనేక విధాలుగా చెప్పారు. బంగారము ఒకటే అయినా ఎంత మంది దగ్గర ఎన్ని రకాలుగా వుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వస్తువును చూసి బంగారాన్ని మర్చిపోతే భ్రమలో పడిపోతాము. బంగారమే గుర్తువుంటే వస్తువు మీద వ్యామోహము వుండక అది ఏ రూపములో వున్నా దాన్ని ఆదరిస్తాము. అలాంటి వారే అనేక కృష్ణులు అని నా భావన.

మీరు చెప్పినట్లు మహాభారతములోని కృష్ణుడు కేవలము రాజనీతి, ధర్మరక్షణ, దుష్టశిక్షణ మొదలగునవి చేసినట్లుగా వుంటుంది. భారతము వ్రాసి నప్పుడు వేద వ్యాసుల వారు కేవలము జరుగుతున్న దానిలో ధర్మాధర్మ సూక్ష్మములను చేర్చి రచించటము జరిగింది. సాక్షాత్తూ దైవమే శ్రీకృష్ణుడుగా దిగివచ్చి ధర్మ సంస్థాపన చేయదలచాడని తెలిసి వ్యాసుల వారు కృష్ణుడు ప్రదర్శించిన రాజనీతిజ్ఞత, స్నేహము, ధర్మ స్థాపన మొదలగు విషయాలు కూలంకుషముగా మహాభారతములో వ్రాయటము జరిగింది. కృష్ణుడు పాండవ పక్షపాతి అవటానికి కారణము కేవలము ధర్మమే. పాండవులు ధర్మాచరము వల్ల కృష్ణుని సాయము పొందగలిగారు.

భారత రచన తరువాత వ్యాకుల మనస్కుడైన వ్యాసుల వారికి నారద మహర్షి ప్రబోధానుసారము భాగవతము రచన జరిగింది. భారతములో ధర్మాన్ని చూచావు, దైవము ఎలా నిర్వర్తించాడో తెలుసుకున్నావు, కానీ దైవము యొక్క లీలను నీవు గ్రహించలేదు. సమస్తము దైవము అధీనములో వుంది. దానిని దర్శించి భాగవత రచన చేయమని నారద మహర్షి తెలుపగా అప్పుడు వ్యాసుల వారు దర్శించిన శ్రీకృష్ణుడు పూర్ణ పురుషుడైన పరతత్వము. కనుకనే భాగవతము నందలి కృష్ణుడు భక్తి, జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించే దైవము. కనుకనే భారతములో, భాగవతములో శ్రీకృష్ణుడు రెండు భిన్న కోణాలలో కనపడాతాడు. రెండు పురాణాలు కాబట్టి రెండు కోణాలు అన్నాను. లేకపోతే అనంత కోణాలు..

కృష్ణ అనగా నలుపు అని అర్థము. దాని లోతు ఎంతో తెలియదు. అలాగే కృష్ణుని గురించి కృష్ణునికే తెలుసు. ఇంతవరకు శ్రీకృష్ణుని పూర్తిగా అవగాహన చేసుకున్న వారుగాని, అతడు చేసిన పనులలోని ధర్మాన్ని తెలుసుకున్నవారు కాని లేరు. గోదావరి దగ్గరకి ఎవరు ఎంత గిన్నే తీసుకు వెళితే వారికి అన్ని నీళ్ళు దక్కుతాయి అన్నట్లు ఎవరు ఎంత తెలుసుకోగలరో అంత తెలుసుకొని కొంత మంది ఊరుకున్నారు. కొంతమందేమో ఇంతే ఇంతకంటే ఏమీలేదు.. ఉందనుకొంటే భ్రమే అన్నారు.

వాసుదేవత్వము అన్నది పదవి కాదు. సమస్త జీవరాసులలో వసించే వాడిని వాసుదేవుడు అంటారు. భగవంతుని నాలుగు వ్యూహాలలో అది మొదటిది. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అనిరుద్ద వ్యూహములు.

http://master-wisdom.blogspot.com/2009/10/blog-post_14.html

ఒక కథ విన్నాను...ఒకసారి గోపికలు వేణువును అడిగారట... ఎందుకే నిన్ను కృష్ణుడు ఎప్పుడు తన దగ్గరే వుంచుకుంటాడు... నువ్వు ఏమి పూజలు చేశావు? ఏమి వ్రతాలు చేశావు? ఎలాంటి పుణ్యము వల్ల అలా వుండగలుగుతున్నావు అని. అప్పుడు వేణువు చెప్పునదట...ఒక్కసారి మీరు నాలోపలికి చూడండి... అని.. వారు చూశారట... ఏమి కనపడింది అని అడిగిందట... వారు ఎమీలేదు.. అంతా ఖాళీగా వుంది అన్నారట. అప్పుడు వేణువు చెప్పిందట...మీరు కూడా మీలోపల ఏమీ లేకుండా ఎలాంటి భావాలు, కోరికలు లేకుండా ఖాళీగా వుంటే అప్పుడు కృష్ణుడు మీతోటే వుంటాడు. అలోచించుకోండి... అన్నదట...

ఎంత తెసినా అది కొంతే..అంతా కాదు. అంతులేనిదే అంతా అంటే....

ధన్యవాదములు,
మంగేష్

ybr (alias ybrao a donkey) చెప్పారు...

Mahabharata is a myth. It is not history.
Telugu poets have numerous changes to the original narrations of Vyasa. If Vyasa's bharata itself doesn't have a historical value, the Indian Language Mahabharatas can have only literary value i.e. we have to read them like novels -- a sort of mixture of history and myth.
You review is very appealing if we view it as a literary exercise. The problem with Hindus and Indians is that they fail to distinguish between history and mythology. Consequently, they build false images of themselves, of a magnitude disproportionate to realities.

మాయానది చెప్పారు...

మనో... చాలా పేద్ద విశ్లేషణ. బాగుంది. అయితే యుగాంతం కూడా చదివావు కదా. అందులో కృష్ణుడిపై రాసిన విశ్లేషణ జోలికి కూడా వెళ్లి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఏమైనా చాన్నాళ్ళ తర్వాత మంచి టపా. టపాతో పాటు, దానికి వచ్చిన వ్యాఖ్యలు మరింత సమాచారం అందించాయి. థ్యాంక్యూ

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కృష్ణుడు బహుశా ఒకడే అనుకుంటాను. తత్వతః ఒకే శక్తి అయినా పురాణాలలో వివిధ రకాలుగా కీర్తింప బడ్డాడు అని కవి భావం అయి ఉండవచ్చు. భాగవతంలో భక్తి విశేషాలు ప్రధానంగా వర్ణిస్తే , హరివంశంలో మహా వీరుడిగా దర్శనమిస్తాడు.

నేను అనేక కృష్ణులు అనడం బహుశా నా పొర పాటు ఏమో.

మనోజ్ఞ చెప్పారు...

అవును సుబ్రహ్మణ్యం గారు, మీ వ్యాఖ్య చదివిన తరువాత నేను కూడా దీని గురించి కొంచెం పరిశోధించాను. వివిధ పురాణాల్లో కృష్ణుడు రకరకాలుగా కీర్తింపబడ్డాడు. కృష్ణులు అనేకం అనే కన్నా కృష్ణ రూపాలు అనేకం అనడం సబబు అనుకుంటా. ఏది ఏమైతేనేం మీ వల్ల నేను మరికొంత చదవగలిగాను అందుకు మీకు ధన్యవాదాలు.

మనోజ్ఞ చెప్పారు...

మంగేష్ గారు ధన్యవాదాలు. మీవ్యాఖ్య చాలా బావుంది. చాలా ఆలస్యం చెబుతున్నాను ఈ విషయం అందుకు క్షంతవ్యురాలిని.మీరు చాలా బాగా చెప్పారండి. అందులో మీరు చెప్పిన కథ ఇంకా బావుంది. నిజంగానే కృష్ణుడి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉందనిపిస్తోంది. నేను చదివినంత వరకు, నాకు అర్ధమైనంత వరకు నేను విశ్లేషించాను అంతే.

మనోజ్ఞ చెప్పారు...

రావు గారు మహాభారతం చరిత్ర, పురాణమా అది నిజంగా జరిగిందా లేదా అని నేను ఎక్కడా చర్చించదలచలేదు. అది ఏదైనప్పటికి ఓ గొప్ప కావ్యం. అందులో మనం తెలుసుకోవలసింది, నేర్చుకోవలసింది చాలా ఉన్నాయి. అలాగే అందులో పాత్రల గురించి కూడా తెలుసుకోవలసింది, వాటి నేర్చుకోవలసింది కూడా ఎంతో ఉంది. నేను అదే చేసాను. ఇందులో హిందువులు, భారతీయులు అన్న ప్రశ్నే లేదు. ఎవరైనీ వీటి గురించి మాట్లాడుకోవచ్చును. మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించడం మానవుల అభివృద్ధికి మేలు. నాకు తెలిసిందతా ఒక్కటే అది.....ఓ గొప్ప పుస్తకం ఒక్కటే, నిజంగా అమరమైనది.

మనోజ్ఞ చెప్పారు...

రవి యుగాంతం చదవలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు. నేను ఆ పుస్తకం ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. అసలు అది చదివిన తరువాతే నాకు భారతం మీద నిజంగా ఇష్టం పుట్టింది. ఆ తరువాతే నేను అసలు భారతం చదివాను, విశ్లేషించడం ప్రారంభించాను. నువ్వు సరిగ్గా గమనించు నేను యుగాంతంలో చెప్పిన చాలా విషయాల మీద చర్చ చేశాను.