అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి ఆరు వజ్రాలు దొరికాయి. వాటిని చూసి, చదివి ఆ అమ్మాయి ఆనందంలో మునిగితేలిపోయింది. ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలియక సతమతమైపోయింది. ఏం అలా చూస్తున్నారేం? వజ్రాలు ఏమిటి, చదవడమేమిటి? ఏంటో ఈ పిచ్చి గోల అనుకుంటున్నారా. అర్థమైందిలెండి. ఇదిగో అసలు పాయింట్ కి వచ్చేస్తున్నాను.నేను ఈ మధ్యన ఆరు వజ్రాల్లాంటి కథలు చదివాను. అదేనండీ మన రావిశాస్త్రిగారు లేరూ(లేరు కదా అని అనకండి)ఆయన రాసిన ఆరు సారా కథలు చదివాను. ఆ మైకంలోనే ఈ కొత్త టపా రాయడం మొదలుపెట్టాను.
నేను యూనివర్శిటీలో ఉన్నప్పుడనుకుంటాను ఒకసారి రావిశాస్త్రి పుస్తకాలు చదివాను. కానీ ఏమిటో అవి నాకప్పుడు అంత తలకెక్కలేదు.ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చదవడం తటస్థించింది.కానీ చదివాక అనిసించింది.నేను ఇన్నాళ్ళు ఎంత తప్పు చేసానా అని.మీకు ప్రపంచం తెలుసుకోవాలనుందా? నగ్న సత్యాలు అంటే వివరం కావాలా? మనుషుల ప్రవర్తన, తీరు తెన్నులు ఎలా ఉంటాయో చూడాలా? అయితే రావిశాస్త్రి పుస్తకాలు చదవండి. ఎన్నో అక్కరలేదు, కేవలం ఆరు సారా కథలు చదవండి చాలు. జీవిత సత్యాలు టన్నులు, టన్నులు కనిపిస్తాయి. ప్రపంచం అంతా మీ కళ్ళ ముందు కదలాడుతుంది.
మామూలు విషయాలు అతి మామూలుగా రాయడం రావిశాస్త్రి పద్ధతి. ''కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం'' అని శ్రీశ్రీ చెప్పారు. రావిశాస్త్రి దాన్ని అక్షరాలా పాటించి చూపించారు. అవే పేర్లతో కథలు రాసి మెప్పించారు. అంతకన్నా ఆశ్చర్యం కలిగించే విషయం సారా మీద కథలు రాయడం. సారా ఎంత నిషా ఎక్కిస్తుందో తెలియదు కానీ రావిశాస్త్రి ఆరుసారా కథలు మాత్రం బాగా మత్తెక్కిస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతపు ప్రజల జీవన విధానాలు, మానవ మనస్తత్వాలు ప్రధానంగా చిత్రిస్తూ సాగిన ఈ కథలు మనకు తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. మనతోనే ఉంటూ, మనలాగే బ్రతుకుతూన్న పేదవారి జీవితాలు ఎలా ఉంటాయో, వారిలో ఎంత విషాదం దాగి ఉందో,పేదరికం వల్ల వారి మధ్య ఉండే మానవసంబంధాలు ఎలా ఉంటాయో కళ్ళకుకట్టినట్టు చూపిస్తాయి.సమాజం తన చుట్టూ తాను అల్లుకున్న నీతిపొర పేదరికం ముందు ఎలా విడిపోతుందో అనుభవం కలిగిస్తాయి. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, వారి జీవన విధానాలు, సమాజంలో దిగజారిపోతున్నవిలువలు అందుకు అంతర్గతంగా సమాజంలోనే దాగిఉన్న కారణాలు వీటన్నిటినీ అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు రావిశాస్త్రి.
"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను,మంచికిహాని ,చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అని అంటారు రావిశాస్త్రి. అందుకు తగ్గట్టుగానే ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారనిపిస్తుంది.స్వతహాగా ఆయన లాయరు కావడం కూడా దీనికి మరింత దోహదపడిందని అనిపిస్తుంది. ఆయన జీవితంలో అతి దగ్గరగా చూసిన సత్యాలనే తన కథలుగా మలుచుకున్నారు. రక్షించవలసిన పోలీసు వ్యవస్థ అవినీతి రుచి మరిగి భక్షించడం మొదలు పెడితే వారి అక్రమార్జన కోసం మొదట బలయ్యేది పేదలే, అసహాయులే అని తన కథల ద్వారా నిరూపించారు.
''ఇవి వాస్తవికతకు నివాళి. వీటిలో కథనం ఉంది. కవిత్వం ఉంది. డ్రామా ఉంది. జీవితాన్ని నిశితంగా పరిశీలించడం ఉంది. ఆ చూసిన దానిమీద వ్యాఖ్యానించినట్టుగా కనిపించని వ్యాఖ్యానం ఉంది''. ఇదీ ఆరు సారాకథలు గురించి శ్రీశ్రీ రాసిన ముందు మాట. ఇది అక్షర సత్యం. ఈ కథలను చదివిన వారికి ఎవరికైనా అనుభూతమయ్యే నిజం. ఆరు కథలూ ఆరు ఆణి ముత్యాలే అయినప్పటికీ అన్నిటిలోకి ప్రత్యేకంగా ఆకట్టుకునే కథ మాత్రం 'మాయ'. అందులోని 'ముత్యాలమ్మ', 'మూర్తి'తో చేసే ప్రసంగం కళ్ళంట నీళ్ళను తెప్పించక మానదు.
కథ పరంగా చూస్తే ముత్యాలమ్మ దొంగసారా అమ్మే వ్యక్తి. పోలీసులకు మామూలు ఇవ్వలేదన్న కారణంగా ఆమెపై దొంగసారా కేసు బనాయించబడుతుంది. ఆ తర్వాత మూర్తి అనే లాయరు ద్వారా బెయిలు పై విడిపింపబడుతంది.మూర్తే ఆమె కేసును కోర్టులో వాదించడానికి ఒప్పుకుంటాడు.కోర్టులో కేసు వాదించి నెగ్గుతాడు కూడా.అయితే దాని వెనుక మూర్తి ప్రయత్నం కన్నా ముత్యాలమ ప్రయత్నమే ఎక్కవ ఉంటుంది. అంటే ఏ పోలీసు అయితే ముత్యాలమ్మ మీద దొంగ కేసు పెట్టాడో, ఆ పోలీసుకే ముత్యాలమ్మ లంచం ఇచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించుకుంటుంది. కేసు నుంచి బయట పడుతుంది. టూకీగా ఇదీ కథ. డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అనడానికి ఈ కథ మంచి ఉదాహరణ. అంతే కాదు కోర్టులు, పోలీసులు ఇదంతా ఓ మాయాలోకం అంటారు రావిశాస్త్రి. అసలు విషయానికి వస్తే ముత్యాలమ్మపై పెట్టబడింది దొంగ కేసు. అంటే సారా అసలుకి దొరకలేదు. కానీ దొరికిందని కేసు పెట్టేరు. దొరకలేదని తిరిగి తేలకొట్టేశారు. అంతా కలిపి మాయ చేసేరు. కానీ ఆ మాయలో ముత్యాలమ్మ పడిన బాధ హృదయవిదారకం. ఆమె అనుభవించిన కష్టం అనంతం.
కథ చాలా మామూలుదే అయి ఉండవచ్చు. కానీ కథనం అద్భుతం. రావిశాస్త్రి రాసిన తీరు నిజంగా మెప్పించక మానదు. అందులో ముత్యాలమ్మ చేత ఆయన చెప్పించే నిజాలు ఒప్పుకోకమానలేము. ఆ కాలంలోనే కాదు ఏ కాలంలో అయినా. కథలో రావిశాస్త్రి ముత్యాలమ్మ చేత ఇలా చెప్పిస్తారు.'' పీడరుబాబూ సెప్తున్నాను. నువ్వేకాదు, ఈ బాబే కాదు, ఏ మనిసి మంచోడని ఒవురు చెప్పినా నాను నమ్మను, ఈ నోకం డబ్బు, యాపారం తప్ప మరేట్నేదు. పశువులు నోర్లేని సొమ్ములు, ఆటికి నీతుంది కాని మనకి నేదు. సదువు లేన్దాన్ని నాకూనేదు, సదువుకున్నోడివి నీకూనేదు. డబ్బు కోసరం నోకం నోకవంతా పడుచుకొంటోంది. డబ్బుకి నాను సారా అమ్మతున్నాను. డబ్బుకి, సదివిన సదువంతా నువ్వముముతున్నావు. డబ్బుకి పోలీసోళ్ళు నాయ్యేన్నమ్ముతున్నారు.మందు కోసరం పెద్దాసుపత్రి కెళ్తే అక్కడ మందులమ్ముతున్నారు, మంచాలమ్ముతున్నారు. లంజెలు రోడ్లంట, రిచ్చాలంట, కార్లంట తిరిగి ఒళ్ళమ్ముకుంటున్నారు. గుళ్లో కెళ్ళి, కొబ్బరికాయ సెక్కా, కాన్డబ్బూ ఇస్తే, ఆ దేవుడి దయే అమ్ముతున్నారు. అమ్మకం, అమ్మకం, అమ్మకం. అమ్మకం తప్ప మరేట్నేదీలోకంలో. నాను సుదువుకో నేదు కానీ , చూసిన సత్తెం మాత్తరం అది. తప్పయితే తప్పని చూపించి సెప్పు. ఇంటాను. '' మీరేమంటారు. దీన్ని తప్పని అంటారా. ప్రపంచం మొత్తం ఇలాగే ఉందా అంటే లేకపోవచ్చును. కానీ చాలా శాతం మట్టుకి జరుగుతోంది ఇదే. కాదంటారా. ఇటువంటివే నిజాలు రావిశాస్త్రి రచనల నిండా మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా ఆరు సారా కథల నిండా కనిపిస్తాయి.
ఆఖరుగా ముఖ్యంగా చెప్పవలసింది మరొకటి ఉంది. అదే రావిశాస్తి భాష గురించి. గురజాడ,శ్రీపాద తర్వాత మాండలికాన్ని అత్యంత ఎక్కువగా వినియోగించి కథలు రాసింది ఈయనే. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం భాషల్లో ఉన్న సొగసు తెలుసుకోవాలంటే రావిశాస్త్రి రచనలు చదవవలసిందే. ప్రతీ ప్రాంతానికి ఆ ప్రాంతపు భాష ఆయువు పట్టులాంటిది.ఆ భాషలో ఉన్న మాధ్యుర్యం మరెక్కడా దొరకనిది.అటువంటి తీయదనమే రావిశాస్త్రి రచనల్లో మనకు దొరుకుతుంది.



16 కామెంట్లు:
మనోజ్ఞ గారు..
ఓ మై గాడ్!
ఇంత బాగా రాసారేమిటి!
చాలా చాలా చాలా బాగా బాగా రాశారు.
ఇంత మంచి రచనకి ఇప్పటి వరకూ కామెంట్లు లేవేమిటి!
నేను కూడా ఈ కథ గూర్చి రాద్దామనుకుంటున్నాను.
ఇంకా నయం. రాశాను కాదు!
మీ బ్లాగ్ చాలా బాగుందండీ. పోస్టులు చాలా నచ్చాయి నాకు.
చాలా బాగుందండీ. .ఇంకా చెప్పాలి అంటే అద్భుతం.
ఇప్పటికిప్పుడే ఆరు కధలు చదివేయాలనిపిస్తుంది...
మంచి బుక్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
మీ వివరణ బాగుంది.. ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి..??
chaalaa baagaa vraasaaru..
@రమణగారు
@chandu s
చాలా చాలా ధన్యవాదాలండీ.అదంతా రావిశాస్త్రి రచనల ప్రభావం. ఆయన రాసిన విధానం నాకు చాలా చాలా నచ్చేసింది. ఇప్పటికి ఆ కథలను ఓ పదిసార్లు చదివాను. చదివిన ప్రతీసారి కొత్త విషయం తెలుస్తోంది.
@ రాజ్ కుమార్
ధన్యవాదాలు. మీకు నచ్చిందా....అయితే వెంటనే ఎలాగోలాగ పుస్తకం సంపాదించి, వెంటనే చదివేయండి. మిస్ కావద్దు.
చాలా థాంక్స్ రాజ్ గారు, శశికళగారు. రావిశాస్త్రి పుస్తకాలు విశాలాంధ్ర వాళ్ళు ప్రచురిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ పుస్తకాలు దొరకడం లేదని విన్నాను. పాత ప్రచరణలు ఎవరి దగ్గరైనా ఉంటే సంపాదించవలసిందే. నేను కూడా అలాగే చదివాను.
చాల బాగుంది. నాకు కూడా రావిశాస్త్రి గారి రచనలు చాలా ఇష్టం. సొమ్ములు పోనాయండి, రత్తాలు రాంబాబు లాంటివి చాల చిన్నపుడే చదివే అవకాసం వచ్చింది. సార కథలు కూడా ఎప్పుడో ఎక్కడో చదివాను కానీ సరిగా గుర్తు లేవు. మళ్లీ దొరికితే బాగుణ్ణు.
'సొమ్ములు ' కాదండి. ..'సొమ్మలు పోనాయండీ అసలు పెరు. సొమ్మలు అంటే తూర్పు యాసలో "ఎద్దులు" అని అర్థంట.
సొమ్మలే కరెక్ట్ అండీ పావని గారు. రావిశాస్త్రిగారు కూడా అలాగే రాసారు. కానీ వాడుకలో సొమ్మలు కాస్తా సొమ్ములు అయిపోయాయి. చాలా మట్టుకు సొమ్ములు అనే అంటారు.
manognaa,
chaala baagundi.
- putcha
మీరు రావిశాస్త్రి అభిమానా? బాగుంది.
@ putcha
ధన్యవాదాలండీ...
@ kastephale
ఆయన కథలు చదివాక ఎవరు అభిమాని కాకుండా ఉండగలరు చెప్పండి. అంతటి ప్రభావంతమైన రచన ఆయనది.
ఈ ఆరు కధల్లో.. "మాయ" ఇప్పుడే చదివానండీ.
మీరు పెంచిన అంచనాలకి మించి ఉంది. సూపర్
పరిచయం చేసినందుకు మరోసారి ధన్యవాదాలు ;)
కథపై రాసే సమీక్ష కన్నా కథే ఎప్పుడూ గొప్పది కదండీ రాజ్ కుమార్ గారూ. మొత్తానికి కథ చదివేరన్నమాట....ఆలస్యం చేయకుండా మిగతా కథలూ చదివేయండి తొందరగా. చెప్పానుగా ఆరు కథలూ ఆరు వజ్రాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి