కొన్ని రచనలు ఎంత చదివినా తనివి తీరదు. చదివిన కొద్దీ చదవాలనిపిస్తాయి. వాటిల్లోని భావం గిలిగిలింతలు పెడుతుంది. ఆనంద లోకాల్లో విహరింపజేస్తుంది. మధురోహలలో తేలియాడిస్తుంది. వాటి ప్రత్యేకత అటువంటిది.ఇలాంటి రచనలలో సిద్ధహస్తుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి.'కాలవిహంగమ పక్షముల దేలియాడి ,తారకా మణులలో తారనై మెరసి,మాయ మయ్యెదను నా మధురగానమున'అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిడు కృష్ణశాస్త్రి. కాని ఆయన కవిత్వం మాత్రం బతికే ఉంది. ఆయన కలం నుండి జాలువారిన అక్షర లక్షలు కూడా నిలిచే ఉన్నాయి తెలుగు వారి నాలుకలపై క్షరం కాకుండా.భావకవితా పితామహుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి నేడు. ఆయనకివే నా అక్షర నివాళులు.
భావుకత ఆయన ఇంటి పేరు. సౌందర్యం, ఆర్ధ్రత, క్లుప్తత ఆయన లక్షణాలు. మూర్తీభవించిన తెలుగుతనం ఆయన. దేని గురించి రాసినా అందంగా రాయడం దేవులపల్లి సొంతం. భావకవిత్వంలో సిద్ధహస్తుడు కృష్ణశాస్త్రి. భావకవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవులెంత మందో ఉన్నారు.కానీ 'తారలెన్ని ఉన్నా జాబిలి ఒక్కటే' అన్నట్టు భావకవిత్వంలో కృష్ణశాస్త్రి ఒక్కడే జాబిలి.
ప్రకృతి చాలా అందమైనది . ఇది అందరికీ తెలిసినదే. కానీ అందులోని నిజమైన సౌందర్యం తెలుసుకోవాలంటే కృష్ణశాస్త్రి కవిత్వం చదివితీరవలసిందే. ఏ కవైనా ప్రకృతిని తన కవిత్వంలో చూపిస్తాడు. కానీ కృష్ణ శాస్త్రి తీరు వేరు. ప్రకృతిలోకి ఆయన కవిత్వం సుతారంగా దూరిపోతుంది. అక్షరాల్ల్లో ఒదిగి పోతుంది. 'ఆకులో ఆకునై, పూవులో పూవునై' అంటూ అందంగా నడిచి వస్తుంది. ఆకులూ, పూవులూ, కొమ్మలూ, రెమ్మలూ, చిగుళ్ళూ, కోయిల్లూ, మొగ్గలూ, వెన్నెల్లూ వీటిని కవితా వస్తువుగా చేసుకొని దేవులపల్లి చేసినట్లుగా రస సృష్టి ఇంకెవరూ చేయలేరు.
సినిమా పాటకు భావకవిత్వం సొబగులద్దిన ఘనత ఒక్క దేవులపల్లికి మాత్రమే సొంతం. అంతులేని భావాన్ని చిన్న చిన్న అచ్చ తెలుగు మాటలతో పాటలు రాయడం కృష్ణశాస్త్రి ప్రత్యేకత. తెలుగు సినిమా పాటకి కొత్త ఒరవడిని సృష్టించారు కృష్ణశాస్త్రి. అంతులేని భావకవిత్వాన్ని చిన్న చిన్న పాటలలో తెలుగు వారికి కానుకలుగా అందించారు.ఇందుకు ఉదాహరణ మల్లీశ్వరి సినిమా పాటలు.ఇందులోని ఒక్కొక్క పాట ఒక్కో ఆణిముత్యం.
వ్యాఖ్యలూ, వివరణలూ అక్కరలేని కవిత్వం కృష్ణశాస్త్రిది. ఈయన శైలిని చాలా మంది అనుకరించారు. కానీ ఆయన స్థాయిలో ఎవరూ రాయలేక పోయారన్నది జగమెరిగిన సత్యం. కృష్ఱశాస్త్రికందని భావం అంటూ లేదు. ప్రేమ, శృంగారం, బాధ, విరహం, భక్తి, దేశభక్తి ఇలా ఎన్నో రకాలు. ఏది రాసినా కృష్ణశాస్త్రి ముద్ర స్సష్టంగా కనిపిస్తుంది. అందులోని సున్నితత్వం, సౌందర్యం హృదయాలను తాకుతుంది.



5 కామెంట్‌లు:
కృష్ణశాస్త్రి గారి మీద చక్కని వ్యాఖ్యానం చేశారు!
"భావుకత ఆయన ఇంటి పేరు. సౌందర్యం, ఆర్ధ్రత, క్లుప్తత ఆయన లక్షణాలు"
చక్కగా చెప్పారు! అభినందనలు.
ధన్యవాదాలు రసజ్ఞగారు, కొత్తావకాయ గారు.
దేవులపల్లి .... మనిషికి మనసులో భావాలెలా వుంటాయో అక్షరబద్ధం చేయడానికి దేవుడు సృష్టించిన ఒకే ఒక్కమనిషి. సందర్భమో కాదో కానీ చదువుకునేరోజుల్లో ఎవరో మల్లేశ్వరి సినిమా గురించి చెపితే, రెండు వాల్యూమ్ ల కేసెట్లు ( సినిమా మొత్తం ) కొనుక్కొని ఎన్నిసార్లు వినిఉంటానో... అప్పటికి నల్లని మొబ్బలను, తెల్లని కొంగలను ఎన్ని సార్లు చూసుంటానో.... కానీ ఆయన పదాల కూర్పు అనితర సాధ్యం.మృదు మధుర భావాలను అక్షరాలను పేర్చి సృష్టించడంలో ఆయనకాయనే సాటి.
నల్లనిమొబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అలాగే "ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు"
అద్భుతమైన పాటలు అంతే ఆర్ద్రతతో భానుమతి గారి గళంవెంట జాలువారుతూ మనల్ని ఎక్కడికో తీసుకెళతాయి.
దేవులపల్లి .... మనిషికి మనసులో భావాలెలా వుంటాయో అక్షరబద్ధం చేయడానికి దేవుడు సృష్టించినట్లో ఒకే ఒక్కమనిషి. బాగా చెప్పారు. అతికినట్టు సరిపోయింది. మా ఇంట్లో కూడా మల్లీశ్వరి కేసెట్ ఉంది. నాకైతే మనసున 'మల్లెల మాలలూగెనే', 'ఎందుకే నీకంత తొందర' పాటలు చాలా ఇష్టం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి