మరేమో నాకేమో చిన్నప్పటి నుండీ ఆటలంటే తెగ పిచ్చి. ఎంత పిచ్చి అంటే అవి ఉంటే, నాతో ఆడే వాళ్ళు ఉంటే నాకు తిండి, నిద్ర, చదువు ఇవేమీ అక్కరలేదన్నమాట. చిన్నప్పుడు మాదో చిన్న ఉమ్మడి కుటుంబం . మా పెద్దనాన్నగారు వాళ్ళు మేము కలిసి ఉండే వాళ్ళం. ఇద్దరన్నయ్యలు, మా అక్క, నేను ఉండే వాళ్ళం అన్నమాట. మా అక్కేమో పేద్ధ బుద్ధిమంతురాల్లో ఫోజుకొడుతూ ఎక్కువగా ఆడుతూండేది కాదు కాని నేను మాత్రం భలే హుషారుగా ఉండేదాన్ని. అమ్మ ఎన్ని తిడుతున్నా, అప్పుడప్పుడు రెండు దెబ్బలు వేసినా కూడా పట్టించుకోకుండా అన్నయ్యలతో తెగ ఆడుతుండేదాన్ని.మరో ఇద్దరు ఉండేవాళ్ళు మాఅత్త కొడుకులు, వాళ్ళిద్దరూ వస్తే మా అక్క కూడా మాతో జత కట్టేది. ఇహ అప్పుడు చూడండి మా ఇల్లు కిష్కిందకాండే. మేము ఆడని ఆట లేదు, తగిలించుకోని దెబ్బ లేదు. నేల బండ, దాగుడుమూతలు, క్రికెట్, పరిగెట్టి ముట్టుకునే ఆట అబ్బో.....ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో.
ఇది ఇంట్లో ప్రహసనం. కొంచెం పెద్దయ్యాక ఫ్రెండ్స్ తో ఆడుకోవడం మొదలయిందా. అప్పుడు నన్ను పట్టుకోవడం మాత్రం మా వాళ్ళ వల్లకాలేదు. ఐదోతరగతి వరకు నాకో మంచి ఫ్రెండ్ ఉండేది మాలతి అని. అది నేను ఎంత ఫ్రెండ్స్ అంటే తిండి, నిద్ర తప్ప మిగతా అన్ని సమయాల్లో కలిసే ఉండే వాళ్ళం. దానికో అక్క, చెల్లి ఉండే వారు, వాళ్ళు కూడా నా దోస్తులే. మా ఉళ్ళో లేడీస్ క్లబ్ వాళ్ళకి ఒక ఫంక్షన్ హాలు ఉండేది, దాని నిర్వహణ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చూసేవారు. ఆ హాలుతో పాటు ఉండే ఓ ఇంట్లో వాళ్ళు ఉండేవారు. అది మా ఇంటికి కూత వేటు దూరంలో ఉండేది. ఇంకేముంది స్కూలు నుంచి రాగానే బలవంతంగా ఏదో కొంత తినడం వాళ్ళింటికి పరుగెట్టడం, ఆ ఫంక్ష్ హాలులో తెగ ఆడడం. మేము ఎక్కువగా ఆడినది బెచ్చాట అనబడే తొక్కుడుబిళ్ళాట. అదేంటో ఎంత ఆడినా మాకు కాళ్ళు మాత్రం నొప్పిపుట్టేవే కాదు.
ఇక తర్వాత హైస్కూలుకు మారిపోయాను. అంటే కొంచెం పెద్దయిపోయాను అన్నమాట. ఆరు, ఏడు క్లాసుల్లో ఉన్నప్పుడు బుద్ధిగా చదువుకోవడం, వారాంతపు సెలవుల్లో, వేసవి సెలవుల్లో అన్నలతో, అత్త కొడుకులతో కలిసి ఆడుకోవడం చేస్తుండేదాన్ని.అది కూడా అన్ని కూర్చుని ఆడే ఆటలే.మా కన్నా పెద్దవాళ్ళు అయిన అన్నలు, అక్కలు ఆడేసి, వాడేసి ఇచ్చిన కేరంబోర్డు ఒకటి ఉండేది మాదగ్గర ఒక వైపు చెక్క ఊడిపోతూ, మరోదగ్గర ఉబ్బెత్తుగా లేచిపోయి.దాంట్లోనే మేమేదో అంతర్జాతీయ ఆటగాళ్లల్లో ఫీలయిపోయి కేరమ్స్ అడేవాళ్ళం. తర్వాత అమెరికా నుంచి ఒక అన్నయ్య వస్తూ నాకు, మా అక్కకూ కలిపి బిజినెస్, అత్తకొడుకులిద్దరికీ కలిపి స్క్రాబెల్ తెచ్చి ఇచ్చాడు.ఇక వాటిపై పడ్డాము.ఎందులో సఖ్యత ఉన్నా లేకపోయినా మాకు ఆటలాడేటప్పుడు మాత్రం గొప్పగా ఉండేది. ఇద్దరం ఇద్దరం పార్టీలుగా విడిపోయి ఆదివారాలు రోజంతా కూర్చుని ఆడుకునే వాళ్ళం. ఇలా జరుగుతుండగా నేను ఎనిమిదో క్లాసుకు రావడం, మిగతా వాళ్లు ఇంటర్లని, టెన్త్ లని బిజీ అయిపోవడంతో నాతో ఆడుకునే వాళ్లు లేకుండా పోయారు. మా అక్క కూడా. ఎప్పుడైనా ఆడుకుందాం రావే అంటే...ఛీ ఛీ ఫోఫో అనేది అదేదో పెద్ద చదివేసేదాన్లా.(చదువు ఒక వంక మాత్రమే, అది దాని ఫ్రెండ్స్ తో రూములో తలుపులేసుకుని కూర్చుని కబుర్లు చెబుతూ ఉండేది. నాకు తెలుసుగా నేను వినేదాన్ని తలుపు సందుల్లో చెవిపెట్టి.) అప్పుడు ప్రవేశించింది నా జీవితంలోకి వాలీబాల్.
మా స్కూల్లో ఆటలు ఆడే వాళ్లు బాగా ఉండేవాళ్ళు. మాకో పీటీ మాస్టారు కూడా ఉండేవారు. మా స్కూల్లో ప్రధానమైన ఆటల్లో వాలీబాల్ ఒకటి. మాకన్నా పెద్దవాళ్ళది ఒకటి టీం ఉండేది అప్పటికే ఆడుతూ. ఒకరోజు సడెన్ గా మా క్లాసులోకి ఒక ప్రకటన వచ్చింది. చూస్తే వాలీబాల్ ఆడేవాళ్లు కావాలి, ఆసక్తి ఉన్నవాళ్ళు పేర్లు నమోదుచేయించుకోండి అని. మా స్కూల్లో ఏ యాక్టివిటీ జరిగినా మనం ముందు ఉండాల్సిందే. పేరు కూడా ఇవ్వక్కరలేదు. టీచర్లే ముందు నా పేరు పిలిచేసేవారు. అలా నాటకాలని, తోలుబొమ్మలాటలని, రేడియో ప్రోగ్రాములని, డాన్ప్ లని అప్పటికే చాలా చేసేసాను. సరే ఇది కూడా అలాంటిదే ఏదో అనేసుకుని పేరు ఇచ్చేసాను. అప్పటికి నాకు వాలీబాల్ ఎలా ఆడతారో తెలీదు సరికదా ఏమిటో కూడా తెలీదు. బాల్ పెద్దదా-చిన్నదా, చేత్తో కొడతారా, బ్యాటుతోనా ఊహూ....ఏమీ తెలీదు. మొత్తానికి ఆడడానికి మాత్రం వెళ్ళపోయాను. అక్కడకు వెళ్ళాక అందరూ నన్ను చూసి ఒకటే నవ్వు. ఎందుకంటే అక్కడ అందరికన్నా చిన్నగా, పొట్టిగా, పీలగా నేనొక్కదాన్నే ఉన్నాను మరి. మా పీటీసార్ అయితే ఏంటి నువ్వు కూడా వచ్చేసావా ఆడడానికి అని అడిగేసారు( సరదాగానేలెండి). అయినా నేనేమి పట్టించుకోలేదు, ఎక్కడా తగ్గలేదు. అలా నా వాలీబాల్ ట్రైనింగ్ మొదలయింది.
మొత్తం ఇరవైమందిమి జాయిన్ అయ్యాము వాలీబాల్ ఆడటానికి. మాకు మా స్కూల్లోనే కాకుండా మా ఉర్లో ఉన్న వాలీబాల్ గ్రౌండ్ లో ఫ్రొఫెషనల్ కోచ్ చేత కూడా ట్రైనింగ్ ఇప్పించేవారు. లాస్ట్ పిరియడ్ గేమ్స్ టైమ్ ఉండేది మాకు వారానికి రెండు రోజులు. కానీ మా వాలీబాల్ టీమ్ కు మాత్రం ప్రతీరోజు అది గేమ్ పిరియడే. ఏ క్లాసు జరుగుతున్నా ఎంచక్కా ఎగ్గొట్టేసి ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత స్కూల్ నుంచి గ్రౌండ్ కి వెళ్ళి చీకటి పడేవరకు ఆడడం అప్పుడు ఇంటికి రావడం.మొదట్లో మా అమ్మ చాలా గొడవ పెట్టేసేది నేను రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాని, చదవడం లేదని. కానీ మా నాన్నగారు నాకు బాగా సపోర్ట్ చేసేవారు. ఆయన కూడా కాలేజీలో ఉన్నప్పుడు వాలీబాల్ అడేవారట. అందుకే నన్ను హాయిగా ఆడుకొమ్మా అనేవారు. మా అమ్మ కూడా తర్వాత ఒప్పుకుంది లెండి ఆడుకోవడానికి....చదువుకుంటానని,మంచి మార్కులు తెచ్చుకుంటానని లాంటివి బోలెడు మాటలిచ్చాక. ఇహ చూడండి అక్కడ నుంచి మనం విజృభించేసామన్నమాట. తెగ ఆడేవాళ్ళం అదే దృష్టిగా. మొదటి ఏడాదంతా నేర్చుకోవడంతో అయిపోయింది. ఏడాదయ్యేసరికి ఇరవైమందిమి కాస్తా కరెక్టుగా ఆరుగురం మిగిలాం.....ఆటదేలి(రాటుదేలి లాంటిది). ఇంతలో ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ కాంపిటీషన్స్ వచ్చాయి.అప్పటికే మా సీనియర్లు స్కూలు వదిలేసి వెళ్ళిపోవడంతో ఆ బాధ్యత మా నెత్తిమీద పడింది.ఈ కప్ వరుసగా మూడు ఏళ్ళు ఒకే టీం గెలిస్తే ఇక ఆ కప్ ఆ స్కూల్లోనే ఉండిపోతుందన్నమాట. అంతకు ముందు ఏడాది మా సీనియర్లు గెలిచారు. అంటే ఇక వరుసగా రెండేళ్ళు మేము గెలిస్తే కప్ మాదయిపోతుంది. మా హెడ్ మాస్టర్ దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఒకరోజు మమ్మలిని ఆయన రూంలోకి పిలిపించి మరీ చెప్పారు. మీరు ఏంచేస్తారో తెలియదు మనం ఈ రెండు సంవత్సరాలు గెలవాలి, కప్పు మనకే రావాలి అని.
అంతే ఇక మేము రెచ్చిపోయాము. పోటీలకు ముందు నెలరోజులు క్లాసులు లేవు ఏమీ లేవు. టీచర్లు కూడా ఏమీ అనేవారు కాదు. ఆడుతూనే ఉండేవాళ్ళం రోజంతా. మొత్తానికి ఆరోజు రానే వచ్చేసింది, పోటీలు మొదలయ్యాయి.మొదటి రోజు వేరే వూరి స్కూలు టీంతో ఆట. భయం భయంగా మొదలైంది. మొత్తం మూడు సెట్లు. మొదటి సెట్ ఓడిపోయాము. అంతే ఇక మా పని అయిపోయింది అనుకున్నాము, హెడ్ మాస్టర్ తో తిట్లు తినడం ఖాయమని ఫిక్స్ అయిపోయాము.విరామ సమయంలో అందరం ఏడుపు మొహాలేసుకుని కూర్చున్నాం. చివరకు ఒక్కటే నిర్ణయించుకున్నాం. కనీసం గట్టిపోటీ అయినా ఇవ్వాలని. రెండో సెట్ మొదలైంది, ఒక్కొక్కరం శ్రద్ధగా ఆడడం మొదలుపెట్టాము. అవతలి వారికి ఏ అవకాశం ఇవ్వలేదు. అంతే ఇంకేముందు రెండు సెట్లు మావే. గేమం గెలిచాము. అప్పడు చూడాలి మా ఆనందం. గెంతులే గెంతులు. అదేదో మొత్తం టోర్నీ గెలిచేసినట్లు. సరే తర్వాత ఆటలన్నీ మా సొంతమే అనుకోండి. అక్కడి నుండి ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా కప్పు గెలిచాము. ఓ చిన్నపాటి చరిత్ర సృష్టించాము. మా హెడ్ మాస్టర్ అయితే మమ్మల్ని పొగడ్తలతో గాల్లోకి ఎత్తేసారు. తర్వాత జరిగిన యాన్యువల్ ఫంక్షన్లో చిన్న సన్మానం కూడా చేయించారు.మరి తర్వాత ఇయర్ ఏమైంది,కప్ ఎవరికొచ్చింది అనేగా మీ డౌట్.ఇంక వేరే చెప్పాలా అది కూడా మాకే వచ్చింది.ఎప్పటికీ కప్పు మాదే అయిపోయింది.
నేను వాలీబాల్ లో ఎంతగా లీనం అయిపోయానంటే అదే నా జీవితం అన్నట్టు ఉండేదాన్ని.గ్రౌండ్లో మా ఆట చూసిన కేరళ వాలీబాల్ కోచ్ ఒకాయన నన్ను,మా ఫ్రెండ్ ని ఆయనతో పాటు తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పిస్తానని,ఖర్చులన్నీ అయనవే అని నాతో వస్తారా అని అడిగారు.వాలీబాల్ కోచ్ గా ఆయనకు మంచి పేరు ఉంది అప్పట్లో. మేము కూడా రడీ అయిపోయాము. గెంతుకుంటూ ఇంటికొచ్చి చెప్పాము. అదిగో అక్కడే అంతా అయిపోయింది.ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కావాల్సిన మనోజ్ఞ ఈ రోజు చిన్నప్పటి జ్ఞాపకాలు తలుచుకుంటూ.... రాసుకుంటూ కూర్చుంది. మా అమ్ముందే తనే కారణం దీనంతటికీ. చచ్చినా వీలు కాదు వెళ్ళడానికి అని ఒకటే మొండిపట్టుదల పట్టుకుని కూర్చుంది. మా నాన్నగారు, అక్క ఇంకా చాలా మంది ఎంత చెప్పినా వీనలేదు. నేను అప్పట్లో చాలా సన్నగా ఉండేదాన్ని లెండి, ఊదితే ఎగిరిపోయేట్టు. పైగా అమ్మాయిని. ఇంతకన్నా వేరే ఏ కారణం కావాలి మా అమ్మ నన్ను పంపించకపోవడానికి. నేను ఎంత ఏడ్చినా లాభం లేకపోయింది. మా నాన్నగారు అమ్మని బతిమాలారు బతిమాలారు ఇక లాభం లేదని వదిలేసారు. నాకు వెళ్ళొద్దని చెప్పేసారు.నాకు మా అమ్మ మీద ఇప్పటికీ కోపంగానే ఉంటుంది ఆ విషయం తలుచుకుంటే. తర్వాతేముందీ టెన్త్, ఇంటరు చదువు........ఆగిపోయింది నా ఆట. టెన్త్ తర్వాత ఒక్కసారి కూడా నేను వాలీబాల్ ఆడలేదు. (మా అమ్మ మీద కోపం కూడా దీనికి కొంత కారణం.) నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు నేషనల్ లెవల్ వరకు వెళ్ళి ఆడొచ్చారు.అది విని ఆనందించడం తప్పితే ఇంకేమీ చేయలేకపోయాను.అలా అర్థాంతరంగా ముగిసిపోయింది నా ఆట.
ఇంతకీ ఈ సోదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అంటే..... ఇన్నాళ్ళ తర్వాత ఇప్పడు నేను మళ్ళీ వాలీబాల్ ఆడుతున్నాను. మాకు ఇక్కడ స్ప్రింగ్ మొదలవడంతో అందరూ వాలీబాల్ ఆడడం మొదలుపెట్టారు.నేను కూడా వాళ్ళతో ఆడుతున్నాను.ఇన్నేళ్ళ తర్వాత ఆడుతున్నాను ఎలా ఆడతానో అనుకుంటూ వెళ్ళాను. కానీ నాకే ఆశ్చర్యం మొదటి రోజే నేను నా మామూలు ఆట ఆడడం మొదలుపెట్టాను ప్రొఫెషనల్ లాగ.నా ఆట చూసి అందరూ పొగిడేసారు అదే తడవుగా.దాంతో మళ్ళీ నా పాత జ్ఞాపకాలన్నీ నిద్రలేచి చుట్టుముట్టేసాయి. అదీ కారణం నా ఈ పోస్ట్ కు.



12 కామెంట్‌లు:
good continue playing
మీ చిన్ననాటి ఆటల జ్ఞాపకాలు బాగున్నాయండీ. బాగా ఆడుకోండి. :)
మనోజ్ఞ మీ చిన్నప్పటి కబుర్లు బావున్నాయండీ...పాపం మీ వాలీబాల్ మధ్యలో ఆగిపోవడమే ఏమీ బాగాలేదు. మా ఊరిలో త్వరలో పోటీలు జరగబోతున్నాయి, పోనీ ఇక్కడకు వచ్చేయకూడదూ.. ఇక్కడ ఆడేసి గెలిచేద్దాం.. ఏమంటారు..
ప్రస్తుతానికి బాగానే ఆడుకుంటున్నానండీ కొత్తావకాయగారు,కష్టేఫలేగారూ . కానీ ఇదీ మూడునాళ్ళ ముచ్చటే కదా అని నా బాధంతానూ.
మీ అవిడియా తెగ నచ్చేసింది జ్యోతిర్మయిగారూ నాకు. అదేదో సినిమాలో అన్నట్టు వాయెస్ వచ్చేస్తా.....గెలిచేద్దాం...కప్పు మనదే.
ఆటలందరికీ రావండీ. ఆడేవాళ్ళందరికీ ప్రోత్స్సాహం కూడా ఉండదు.
నాకూ ఇలాగే ఏ ఆటా రాకుండా, ఆడకుండా పోయింది. ;( ;( మార్కులూ, ఎక్కాలూ, లెక్కలూ వీటితోటే సరిపోయె. పోనీ అందులో పెద్ద పొడిచేశామా అంటే అదీ లేదు. ;( ;(. మీకు వాలీబాల్ ఎలాగో నాకు ఏడుపెంకులాట అలాగ. ;)
ఇరగదీసెయ్యండీ. తగ్గొద్దు ;)
ఆటదేలి.. బాగుంది ;) ;)
ధన్యవాదాలు రాజ్ కుమార్ గారూ మీ సవరణకి. ప్రస్తుతానికి తగ్గటం లేదు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.
చాన్నాళ్ల తర్వాత నీ బ్లాగు చూశా మనో. అఫ్‌కోర్స్ నువ్వు కూడా చాన్నాళ్ల తర్వాతే కొత్త పోస్ట్ ఉంచావనుకో. కానీ నువ్వు వాలీబాల్ ప్లేయర్ అన్న విషయం ఎప్పుడూ చెప్పలేదే. ఇంతకూ ఇండియాకెప్పుడు...
మీ బ్లాగ్ను ఇదేనండీ చూడటం. బావుంది. కూర్చొని ఇంచుమించు అన్ని టపాలు చదివేను. కధల గురించి, సాహిత్యకారుల గురించి చాలా విషయాలు చెబుతున్నారు. కొనసాగించండి.
నా బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ ఊకదంపుడు బ్టాగర్ గారూ.....
ఏమో రవీ....మనమధ్య ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదనుకుంటా....ఇండియా ఆగస్టులో వస్తాననుకుంటా.
రషోమన్ పోస్టర్ నీ బ్లాగ్ ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నావా....వావ్ చాలా బావుంది. మంచి సినిమా కదా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి