31, జులై 2012, మంగళవారం

జానపద కళలు

                                  లిపి పుట్టక ముందు పుట్టిన సాహిత్యం జానపద సాహిత్యం. కేవలం మాటల ద్వారానే భావాలు వ్యక్తపరుచుకునే రోజుల్లో మనుషుల చేతల నుంచి, వారి కష్టసుఖాల నుంచి, అలవాట్ల నుంచి పుట్టిందీ జానపద సాహిత్యం. చాలా రోజుల వరకు మౌఖికంగానే ప్రచారం పొందిన ఈ జానపదసాహిత్యం, లిపి బాగా అభివృద్ధి చెందిన తర్వాత పుస్తకాలలో పొందుపరచబడింది. అప్పటి వరకు మనుషులు ఒకరి దగ్గర నుంచి ఒకరు విని నేర్చుకునేవారు. ఇలా వ్యాప్తిచెందిన వాటిల్లో జానపద గేయాలు, గేయకథలు, కళలు, సామెతలు, పొడుపు కథలు ఇంకా చాలా రకాలు పుట్టుకు వచ్చాయి.ఇవన్నీ అప్పటివారి జీవన విధానంలోంచి పుట్టినవే కావడం గమనార్హం. సామెతలు, పొడుపు కథల ద్వారా ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది.

                                 తెలుగునాట ప్రాచుర్యం పొందిన జానపద కళలు చాలానే ఉన్నాయి. ఈనాడు రేడియోలు, టీవీలు అంటూ వినోద సాధనాలు అనేకం రావడంతో వీటిని పట్టించుకునే వారు కరువయ్యారు. కానీ చాలా రోజు క్రితం వరకు జానపద కళలకు అత్యంత ప్రజాదరణ ఉంది.నేటీకి పల్లెల్లో ఈ జానపద కళలను ఆదరిస్తూనే ఉన్నారు. కొంత మంది వీటిమీద మక్కువతో ప్రత్యేకంగా నేర్చుకుంటున్నారు కూడా. ఆంధ్రప్రదేశ్ లో ప్రాచర్యంలో ఉన్న జానపద కళల సంఖ్య బాగానే ఉంది. జానపద గేయాలు, గేయకథలు, ఒగ్గు కథలు, బుర్రకథలు, కోలాటాలు, తోలుబొమ్మలాట, తప్పెట గుళ్ళు, శారదగాండ్రు, చెంచు భాగోతం, కొమ్ముకథ, వీథి నాటకం, పిచ్చుక కుంటలు, వీరముష్టివారు, దొమ్మరి ఆట, కొఱవంజి, గొల్లసుద్దులు, జంగం కథలు, జక్కుల కథలు, కాటపాపల వారు, దాసరులు, చెక్క భజన, యక్షగానం, పులివేషాలు ఇంకా పలు రకాలైన జానపద కళలు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొంది ఉన్నాయి. వీటిలో గేయకథలు, ఒగ్గుకథలు, బుర్రకథలు, కొమ్ముకథ, వీథినాటకం, జంగం కథలు వంటివి ఒకే కోవకు చెందినవిగా ఉంటాయి. వీటి ముఖ్య గుణం పాటలు పాడుతూ కథలు చెప్పడం. పౌరాణిక కథలు గాని, చారిత్రక కథలు గాని పాటల ద్వారా ఇతరులకు చెప్పే పద్ధతిలో ఇవన్నీ ఉంటాయి.జానపద కళల్లో ముఖ్య సాధనాలు డప్పు, తంబురా. ప్రతీ జానపద కళకి వీటిని వాడడం కద్దు. కొన్ని కళలకు మిగతా కొన్ని రకాలైన వాయిద్యాలను కూడా వాడతారు.కానీ ఈ రెండూ లేకుండా ఏ జానపద కళా ఉండదు సర్వసాధారణంగా.జానపద కళాస్వరూపాలు అనే పేరుతో మిక్కలినేని రాధాకృష్ణ మూర్తిగారు పుస్తకం ప్రచురించారు. ఇందులో ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జానపద కళలన్నింటి గురించి విపులంగా చర్చించారు.

                                     జానపద కళల్లో ముందు చెప్పుకోవలసినది జానద గేయం గురించి. కొన్ని జానపద కళలు కాలాంతరంలో ఏర్పడ్డాయి.కాని గేయం మాత్రం మనిషికి మాట్లాడడం ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఉందని చెబుతారు.మొదట్లో ఈ గేయాలు మాటలకు ప్రతిరూపంగా పాడుకునేవారు అని అంటారు. మామూలుగా మాట్లాడుకునే మాటలనే గేయ రూపంలో పాడుకోవడం అన్నమాట. తర్వాత్తర్వాత ఇది అభివృద్ధి చెంది మనకు అనేకమైన జానపద గీతాలు అందుబాటులోకి వచ్చాయి.మనుషులు మొదట నుంచి శ్రామిక జీవులు. వారు తమ శ్రమను తగ్గించుకోవడానికి పాటలు పాడుకుంటూ పనిచేసుకునే వారని జానపద సాహిత్య పరిశోధకుల అభిప్రాయం. వీరి తర్వాత జానపద గేయాలను ఎక్కువగా పాడుకునేది స్త్రీలు. పల్లెల్లో నివసించే స్త్రీలు చేసే ప్రతీపనికి పాటలు పాడుతుంటారు. ఇంట్లో జరిగే కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో, పండుగలుపబ్బాల్లో కూడా పాటలు పాడుకునే వారు.దీనిని బట్టి జానపద గేయాలను కొన్ని వర్గాలుగా విభజించారు కూడా. శ్రామికగేయాలు, పెళ్ళిళ్ళపాటలు, దంపుడు పాటలు, భక్తి గేయాలు, శృంగార గేయాలు ఇలా కొన్ని రకాలైన వర్గీకరణలు చేసారు. ఏటికేతాం పట్టి, అత్తలేని కోడలుత్తమురాలు, బావా బావా పన్నీరు వంటి గేయాలు జానపద గేయాల కోవకు చెందినవే కావడం గమనార్హం.

                                    జానపద గేయాల తర్వాత చెప్పుకోవలసిన కళ గేయకథలు. పాటల రూపంలో కథలు చెప్పడం వీటి యొక్క ప్రత్యేకత. కాటమరాజు కథ, పల్నాటి వీర చరిత్ర, తాండ్రాపాపారాయుని కథ, బొబ్బిలి కథ వంటివి జానపద గేయ కథలకు ఉదాహరణలు. తంబురా మీటుతూనో, డప్పు వాయిస్తూ వీరుల కథల్ని పాట రూపంలో చెప్పేవారు. పల్లెల్లో పని చేసి వచ్చిన తర్వాత రాత్రివేళల్లో పెద్దవారు తమకు తెలిసిన వీరగాథల్ని ఇలా గేయకథల రూపంలో చెప్పేవారు. దానిని విన్న వారు తమ తర్వాత్తరాల వారికి అందించేవారు. కాటమరాజు కథ వంటి గేయకథలు లిపి అభివృద్ధి చెందక మునుపు నుంచి ఉండేవని జానపద చరిత్రకారుల అభిప్రాయం. తెలుగులో లిపి సుమారుగా 10, 11 శతాబ్దాలలో మొదలయ్యింది. అంతకు ముందు వీరుల కథలను, చరిత్రను జానపదులు తమ గేయకథల రూపంలో వ్యాప్తిచెందించేవారు. లిపి బాగా అభివృద్ధి చెందిన తర్వాత వీటిని గ్రంథస్థం చేశారు.

                                     జానపద కళల్లో బాగా ప్రాచర్యం పొందినది బుర్రకథలు. ఈ కళ ఎక్కువగా తూర్పు ఆంధ్రా అంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో బాగా ప్రసిద్ధి పొందింది. ఇది కూడా ఒక రకంగా గేయకథా రూపం కిందకే వస్తుంది. కాని చెప్పేవిధానంలో తేడా ఉంటుంది. ఇందులో ముగ్గురు కథ చెబుతుంటారు. తానాతందాన అనే వాక్యం లేదా ఊతపదం లేదా నానుడి బుర్రకథ నుండి వచ్చిందే. బుర్రకథలో ముగ్గురు ఉంటారు అని ముందే మనం చెప్పుకున్నాం. ముగ్గురూ వరునసగా నిలబడి అప్పుడప్పుడూ తాళానికి అనుగుణంగా చిన్నగా నృత్యం చేస్తూ బుర్రకథను చెబుతారు.ముగ్గురిలో మధ్యలో వుండే వ్యక్తి తంబురాను మీటుతూ కథను చెబుతాడు. బుర్రకథలో కీలకవ్యక్తి ఇతనే.మిగతా ఇద్దరూ చిన్న చిన్న డోళ్ళను పట్టుకుని కథకునికి సహకారం అందిస్తుంటారు. కథకుడు చెప్పే విషయానికి వీరు తానతందాన అంటూంటారు. అంటే కథకుడు చెప్పేది నిజమే అన్న అర్థం స్ఫురింపజేస్తూ ఉంటారన్నమాట. అందుకే ఎవరికైనా పక్కవారు వత్తాసు పలుకుతుంటే తానతందాన గాళ్ళురా అని వారిని వెక్కిరించడం జరుగుతూ ఉంటుంది. దీనిని బుర్రకథ నుంచే తీసుకున్నారు. వీరు చరిత్రలో జరిగిన విషయాలను, వీర కథలను, సాంఘిక, సామాజిక విషయాలను తమ బుర్రకథల ద్వారా చెబుతూ ప్రజలలో చైతన్యం కలిగించేవారు.గురజాడ రాసిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథను బుర్రకథ రూపంలో చెబుతూ బాల్యవివాహాలపై అప్పటి ప్రజల్లో చైతన్యం కలిగించేవారు. దీనిని మన తెలుగు కన్యాశుల్కం సినిమాలో కూడా చూపించారు.అలాగే వితంతు వివాహాలు వంటి సాంఘిక దురాచారాలపై కూడా బుర్రకథ ప్రదర్శనలు జరుగుతుండేవి. వీరు జరిగిన కథలను కళ్ళకు కట్టినట్టు చెప్పడంతో ప్రజలలోకి బాగా చొచ్చుకొని వెళ్ళేవి. వీటి తర్వాత ఒగ్గు కథలు, చెంచు భాగోతం, కొమ్ముకథ, జంగం కథలు ఇవన్నీ గేయకథల కోవకు చెందినవే. వివిధ రూపాలలో కథలను చెప్పడం వీటి లక్షణం.

                                            వీటి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవలసిన జానపదకళా రూపం దాసరులు. వీరు ఆంధ్రదేశంలో చాలాకాలం నుండి ఉండేవారని తెలుస్తోంది.శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో దాసరుల గురించి విపులంగా చర్చించబడింది.వీరు కిన్నెరను వాయిస్తూ విష్ణుమూర్తి మహిమల గురించి చెబుతూ ఇంటింటికీ తిరుగుతూ యాచిస్తూ జీవిస్తుంటారు. వీరికి ప్రత్యేకమైన వేషధారణ కూడా ఉంటుంది. కొంత విష్ణువు రూపాన్ని అనుకరిస్తూ శంఖ-చక్రాలు, తెల్లని నామాలు ధరిస్తారు. చెవులకు కుండలాలు, గుర్రపు వెంట్రుకలతో తయారుచేసిన విసనకర్ర, చిటితాళాలు, గొడుగు, చంకలో బుట్ట పట్టుకుని తిరుగుతుంటారు. వీరు కొన్ని కులాలకు సంబంధించిన పూజారులు, గురువులుగా కూడా వ్యవహరిస్తుంటారు.

                                    ప్రజలకు పురాణ, చారిత్రక, సామాజిక, సాంఘిక జ్ఞనాన్ని అందించే మరొక రకమైన జానపద కళ తోలుబొమ్మలాట.ఇంతకు ముందు గేయకథలు మొదలగువాటిలో మనుషులే కథలు చెప్పడం పరిపాటి అయితే ఇందులో తోలుబొమ్మలు ప్రధానపాత్ర వహిస్తాయి. గుడ్డలతో రకరకాల బొమ్మలను చేసి వాటిని తెర ముందు ఆడిస్తూ తెర వెనుక నుంచి మనుషులు కథను చెబుతూ సాగుతుంటాయి. ఈ తోలుబొమ్మలాటలు విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందింస్తాయి.

                                  ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి పొందిన జానపద కళ శారదకాండ్రు. ఆడ, మగ కలిసి శైవ కథలు, శైవ భక్తుల, వీరుల కథలు చెప్పడం వీరి ఆచారం. వీరు కథలు చెబుతుంటే ఆ కథలలో ఉండే వీరరసం కళ్ళకు కట్టినట్టు ఉంటుందని చెబుతారు. వీరిలో మగవారు కథను చెబుతుంటే ఆడవారు ఓ భారతీ కరుణామతీ! శారదా కరుణానిధీ! అని వంతపాడతుంటారు. వీరు శారద అనే పేరుగల తంబురా వాయిస్తూ కథ చెప్పడంతో వీరికి శారదకాండ్రు అని పేరు వచ్చిందని అంటారు.

                                  యక్షగానం....ఇదీ కూడా జానపద కళా రూపానికి చెందినదే అంటారు సాహిత్యకారులు. ఇందులో పురాణాల గురించి ఎక్కువగా చెబుతారు. పైన చెప్పిన కళా రూపాల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉండి మాత్రమే కథను చెబుతుంటారు. కానీ యక్షగానంలో ఏ కథనైతే చెబుతారో అందులో ఎన్ని పాత్రలు ఉంటాయో అంతమంది కనిపిస్తారు. పురాణ పాత్రల వేషాలు తాము ధరించి నృత్యం చేస్తూ కథారూపాన్ని ప్రదర్సిస్తారు. 16వ శతాబ్దం తర్వాత యక్షగానాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అప్పటి కవులు, కొంతమంది రాజులు కూడా అనేకమైన యక్షగానాలను రచించారు.

                                  వీరముష్టివారు, దొమ్మరాట, పిచ్చుక కుంటలు, గారడీ విద్యలు వంటి జానపద కళారూపాలు అన్నీ కేవలం వినోద ప్రధానమైన కళారూపాలు. వీరు ఊరూరా తిరుగుతూ, యాచక వృత్తిని అవలంబిస్తూ జీవిస్తారు. దొమ్మరాట ఆడే వాళ్ళు ఏ ఊరిలో ఉంటే ఆ వూరిలోనే వారి నివాసం. మగవారు ఏదో ఒక స్థలంలో తమకు వచ్చిన విద్యలను ప్రదర్శిస్తూ యాచిస్తే,ఆడవారు పూసలు అమ్ముకుంటూ జీవిస్తారు. దొమ్మరాటలు ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో జరుగుతుండడం మనం గమనిస్తూ ఉంటాము. అలాగే గారడీ విద్యలు ప్రధర్శించేవారు గారడీ విద్యలతో పాటు మూలికలు, పసరు ఆకులు అమ్ముతూ జీవనం కొనసాగిస్తుంటారు.

                                 కర్రసాము, కత్తిసాము, ముష్టి యుద్ధం వంటివి కూడా జానపద కళా రూపాలకు సంబంధించినవే. ఇవి ప్రధానంగా ప్రదర్శనా నైపుణ్యానికి సంబంధించిన విద్యలు. వీటి కోసం ప్రత్యేకంగా తర్ఫీదుని ఇస్తారు. వీరి ఇష్ట దైవం ఆంజనేయుడు. ఇక పులివేషాలు, హరిదాసులు వంటివారు మనకు పండుగలప్పుడు, గ్రామదేవతల జాతరలప్పుడు కనిపిస్తుంటారు.గ్రామదేవతల జాతరలో పులివేషాలు వెయ్యడం బాగా ప్రసిద్ధి చెందింది. వీరిని అమ్మవారి ప్రతిరూపంగా పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. పక్కవాయిద్యాల వారు బాజా, డప్పులు మోగిస్తూ ఉంటే పులివేషం వేసుకున్నవారు పులిలా నర్తిస్తుంటారు. ఇక హరిదాసుల విషయానికి వస్తే వీరి ప్రధాన వృత్తి కూడా యాచకమే. ఒక చేతిలో తంబురా, మరొక చేతిలో చిడతలు వాయిస్తూ హరినామ స్మరణ చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ యాచిస్తూ ఉంటారు.వీరు పూర్వం రోజూ ఇంటింటికీ తిరుగుతూ తమ కులవృత్తిని నిర్వహించుకునే వారు. కాని కాలక్రమంలో హరిదాసులు అంతరించిపోతున్నారు. వీరికి ఆదరణ కరువవ్వడంతో వేరే వృత్తుల వైపు దారులు మళ్ళిస్తున్నారు.కానీ ఇప్పటికీ పల్లెల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే హరిదాసులు కనిపించి తీరవలసిందే.రాను రానూ ఎలా అయిందంటే సంక్రాంతి పండుగ అంటే హరిదాసులు, గంగిరెద్దు ఆటగాళ్ళు అని చెప్పుకునేటట్టు ప్రజలు తయారయ్యారు. ఇలా ఒక్కొక్క కళ గురించి చెప్పుకుంటే పోతే ఒక పెద్ద పుస్తకమే తయారవుతుంది.ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఇన్ని జానపద కళలు ఉంటే మొత్తం భారతదేశం అంతా కలిపితే..... లెక్కలేనన్ని జానపద కళలు బయటకు వస్తాయి. వాటి జాబితానే ఒక పుస్తకంగా రూపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు.

                                      ప్రాచీన సమాజంలో మామూలు జనాలకు ఇటువంటి జానపద కళా రూపాలే వినోద, ప్రసార, చైతన్య మాధ్యమాలు. రాచకొలువుల్లో వుండే పండితులు, శిష్టుల రచనా రూపాలు కేవలం రాచకొలువుకు మాత్రమే పరిమితమయ్యేవి.అటువంటి కాలంలో ప్రజలకు జ్ఞానాన్ని అందించడానికి ఈ జానపద కళలు మార్గాలుగా ఏర్పడ్డాయి. పురాణాల గురించి కానీ, చరిత్ర గురించి కానీ దృశ్య రూపంలో ప్రజలకు అందించినవి ఈ జానపద కళా రూపాలే.చాలా మంది ఇప్పటికే వీటిపై పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు వెలువరించారు. అయినప్పటికీ జరగవలసిన పరిశోధన ఇంకా చాలానే మిగిలి ఉంది.ఆధునిక పరిజ్ఞాన ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న జానపద కళలను రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీటిపై జరిగే పరిశోధనలను పుస్తకాల వరకే పరిమితం చేయకుండా, కళారూపాలుగా కూడా వీటిని సజీవంగా ఉంచేందుకు కృషి చేయాల్సిన అవసరమూ ఉంది.

                                        అక్షరాస్యత మొదలవకముందు పుట్టిన సాహిత్యం, కళలు జానపద సాహిత్యం. జానపదులు అప్రయత్నంగా తమ సహజ భావాలను వెలువరించినప్పుడు ఆవిర్భవించినదే ఈ జానపద సాహిత్యం. సంతోషం, విషాదం, కరుణ, శృంగారం, వీరి తదితర మానసికభావాలు వెలిపుచ్చడానికి జానపదులు ఏర్పరచుకున్న మార్గమే ఈ జానపద కళలు. జానపద కళలు, కవిత్వం, పొడుపు కథలు వంటివి అన్నీ జానపద సాహిత్యం కిందకు వస్తాయి. నైసర్గిక భావప్రకటన ఆధారంగా, ఆశువుగా పుట్టాయి కనుక వీటికి సాహిత్యానికి సంబంధించినటువంటిగాని, సంగీతానికి, నృత్యానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు, రీతులు, పరిమితులు అడ్డరావు. వీటి ప్రధాన లక్షణాలు మౌఖికము, ఆశువుగా పుట్టడం, లయ. ఈ కళల ప్రదర్శనలో కాలంలో, ప్రాంతాల్లో తేడాలుంటాయి కాని భావప్రకటనలో మాత్రం తేడా ఉండదు. జానపద కళలు ఎంత ప్రాచీనమైనవో అంత విన్నూత్నమైనవి కూడానూ.వీరి కళల ద్వారా ఎంత నాగరికత అభివృద్ధి చెందిందో మన ఊహకు కూడా అందదు. జానపదుల ప్రతీమాట, ప్రతీ కదలిక కూడా ఒక కళారూపమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.





























8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Well said

సుజాత వేల్పూరి చెప్పారు...

బావుంది మనోజ్ఞా వ్యాసం! జానపద కళా రూపాలని సమగ్రంగానే చర్చించావు. అయితే వీటిలో చాలా కళలు అంతరించి పోకుండా ఆలిండియా రేడియో, దూర దర్శన్ చాలా వరకూ కృషి చేశాయి. వీలైనంత వరకూ జనబాహుళ్యానికి పరిచయం చేసి నిలబెట్టాలని ప్రయత్నించాయి. ఆ రెంటి కృషినీ కొంత పేర్కొని ఉంటే బాగుండేది. అలాగే ఆ కళలో నిష్ణాతులైన కళాకారుల పేర్లు,వివరాలు ఇస్తే మరింత నిండుగా ఉండేది.

అయితే సమాచార సేకరణలో ప్రవాసంలో ఉండటం వల్ల నీకు కొన్ని పరిమితులుంటాయి కాబట్టి ఇది అర్థం చేసుకోదగ్గదే!

మరో సారి అభినందనలు. ముందు ముందు ఇలాంటి మంచి వ్యాసాలు మరిన్ని రాయాలని కోరుతూ...

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మనోజ్ఞ గారు,
చాలా విషయాల్ని చక్కగా ప్రస్తావించారు. వీటి గురించి ఇలా విపులమైన వివరణలు వెలువడుతుంటేనన్నా ముందు తరాలకు అందుతాయి.
లిపి ఏర్పడక ముందు, అక్షరాస్యత రాకముందు సృష్టించబడిందే జానపదమా అంటే కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాధనతో, పాండిత్యంతో ఛందోబద్ధంగా సృష్టించబడిన సాహిత్యం తో సమాంతరంగా అలవోకగా , మనసును తత్క్షణం తేలిక పఱచే సాధనంగా ఎటువంటి నియమనిబంధనల అడ్డంకి లేకుండా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నా మాట ఏంటంటే లిపి ఏర్పడక ముందు సాహిత్యంగా మాత్రమే కాక శిష్ట సాహిత్యంతో సమాంతరంగా విశిష్టమైన జనాకర్షణాశక్తితో వృద్ధి చెందుతూనే ఉంది.కదా!

మనోజ్ఞ చెప్పారు...

అది రాసేసరికి పెద్ద వ్యాసం అయిపోయింది సుజాతగారూ. ఇంకా రాయాలని ఉన్నా రాయలేకపోయాను. కానీ అందులో రాయలేనివి అన్నీ సేకరించి నా బ్లాగ్ లో మరో వ్యాసం రాస్తాను. ప్రస్తుతం నేను రాసినదంతా ఎమ్.ఏ లో నేను చదువుకున్నది. మిగతా సమాచారం కోసం నేను కూడా కొంత కృషి చేయాల్సిందే. ఎలాగో ఇండియా వెళుతున్నాను కదా, ఈపని కూడా చేసి మరో వ్యాసం రాస్తాను.

మనోజ్ఞ చెప్పారు...

ధన్యవాదాలు కష్టేఫలి గారూ, లక్ష్మీదేవి గారూ. 'లిపి ఏర్పడక ముందు, అక్షరాస్యత రాకముందు సృష్టించబడింది' అని చెప్పింది కేవలం జానపద సాహిత్యం పుట్టక గురించి మాత్రమే. ఆ తరువాత కూడా ఉంది కాబట్టే మనం ఇప్పటికీ వాటి గురించి చెప్పుకోగలుగుతున్నాము.

Anil Atluri చెప్పారు...

బాగుంది..

Nrahamthulla చెప్పారు...

మనోజ్ఞా చాలా సమాచారం ఇచ్చారు. తెలుగు వికీపీడియాలో కూడా ఈ సమాచారం పెట్టండి.http://archive.org/details/TeluguVariJanapadaKalarupalu , http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%B2%E0%B1%81

భాస్కర్ కె చెప్పారు...

వినాయకచవితి శుభాకాంక్షలండి,